
విద్యుదాఘాతంతో యువకుడి దుర్మరణం
పెద్దపంజాణి: మండలంలోని చీకలదిన్నేపల్లి సమీపంలోని ఓ కోళ్ల ఫారంలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పెద్దపంజాణి పోలీసుల కథనం మేరకు.. చత్తీస్‌ఘడ్‌కు చెందిన సంతూ యాదవ్ కుమారుడు ఖిరసే యాదవ్ (25) ఆరు నెలల నుంచి చీకలదిన్నేపల్లి సమీపంలోని ఓ కోళ్ల ఫారంలో కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కోళ్ల ఫారంలోని ఫ్యాన్‌ను సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యదాఘాతానికి గురై కోమాలోకి వెళ్లాడు. వెంటనే ప్రమాదాన్ని గుర్తించిన ఇతర కూలీలు 108 వాహనంలో అతన్ని పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కోళ్లఫారం మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి ఆత్మహత్య
పుంగనూరు: పట్టణంలోని భగత్‌సింగ్‌కాలనీ చెందిన అబ్దుల్‌వాహాబ్ కుమారుడు సయ్యద్(22) అనారోగ్యంతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సయ్యద్ ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే మృతి చెందడంతో పోలీసులు శవాన్ని పోస్టుమార్టానికి తరలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్వీయూలో జర్మనీ భాష అభ్యసన కేంద్రం!
తిరుపతి సిటీ : ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల ‘స్టడీ వింగ్స్ ఓవర్సీస్ సంస్థ’ సహకారంతో జర్మనీ భాష అభ్యసన కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఉప కులపతి కార్యాలయంలో స్టడీ వింగ్స్ సంస్థ ప్రతినిధులు శుక్రవారం వర్సిటీ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. జర్మనీలో విద్యా, ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీని కోసం వర్సిటీ నందు ‘స్టడీ వింగ్స్ టు ఓవర్సీస్’ సంస్థ సహకారంతో జర్మనీ అభ్యసన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. సమావేశం అనంతరం సంస్థ ప్రతినిధులు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో ఇంట్రాక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో స్టడీ వింగ్స్ సంస్థ ప్రతినిధులు నరేంద్ర రెడ్డి, వల్లేరు సుకన్య, అధ్యాపకులు, ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో యువకుడి దుర్మరణం