
నిఘా నీడలోనేనా?
● రేపటి నుంచి ఎస్వీయూ డీడీఈ పరీక్షలు ● రాష్ట్ర వ్యాప్తంగా 43, ఇతర రాష్ట్రాలలో 8సెంటర్లలో పరీక్షలు ● హాజరుకానున్న 32 వేల మంది అభ్యర్థులు ● డెబ్ నిబంధనలు పాటించకుంటే కోర్టును ఆశ్రయిస్తామంటున్న విద్యార్థి సంఘాలు
తిరుపతి సిటీ: ఎస్వీయూ దూరవిద్యా కేంద్రం పరిధిలో యూజీ, పీజీ పరీక్షల నిర్వహణకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఏడాదిగా సుమారు నాలుగు దపాలుగా వాయిదా పడిన ఈ పరీక్షలు ఎట్టకేలకు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పరీక్షల నిర్వహణలో వర్సిటీ అధికారులు విఫలమయ్యారని, అవినీతి రాజ్యమేలుతోందని, నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు విద్యాసంస్థలలో పరీక్షలు నిర్వహించేందుకు పూనుకున్నారని విద్యార్థి సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. యూజీసీ డెబ్ నిబంధనలకు లోబడి పరీక్షలను ప్రభుత్వ కళాశాలల్లో మాత్రమే నిర్వహించాలని వర్సిటీ అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 43 పరీక్షా కేంద్రాలలోనూ, ఇతర రాష్ట్రాలలో మరో 8 సెంటర్లలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు పూర్తి చేశారు. ఈ పరీక్షలకు సుమారు 32 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
తప్పని తిప్పలు
డీడీఈ నిబంధనల ప్రకారం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు 15 రోజుల ముందుగానే హాల్‌టికెట్లు జారీ చేయాల్సి ఉంది. కానీ అధికారులు పరీక్షలకు మూడు రోజుల ముందు శనివారం రోజు నుంచి హాల్‌టికెట్లును ఆల్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. దీంతో ఇతర రాష్ట్రాలలో ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. తమకు శనివారం రోజున హాల్‌టికెట్లు అందిస్తే పనిచేస్తున్న కంపెనీలలో సెలవుకు దరఖాస్తు చేసుకుని సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం సాధ్యమేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అభ్యర్థులు స్టడీ సెంటర్ల నిర్వహాకులను సంప్రదించి తమగోడును విన్నవించుకుంటున్నారు. వర్సిటీ అధికారులు కనీసం అభ్యర్థుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించడం దారుణమని మండిపడుతున్నారు.
డెబ్ నిబంధనలు అమలయ్యేనా?
డీడీఈ పరీక్షలు యూజీ డెబ్ నిబంధనల ప్రకారం నిర్వహించాలని ఇప్పటికే న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలతో పాటు వీడియో రికార్డింగ్ చేపట్టి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. కానీ బుధవారం నుంచి నిర్వహించనున్న పరీక్షలకు అధికారులు ఆ మేరకు చర్యలు చేపట్టని పక్షంలో విద్యార్థి సంఘాలు మరోమారు న్యాయస్థానాల తలుపుతట్టేందుకు సిద్ధమవుతున్నారు. మాస్ కాపీయంగ్‌ను పూర్తి స్థాయిలో అరికట్టి నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. పరీక్షా కేంద్రాలను కేవలం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలో మాత్రమే నిర్వహించాల్సి ఉందని డెబ్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
నిబంధనల మేరకే పరీక్షలు
యూజీసీ నిబంధనల మేరకు ప్రభుత్వ కళాశాలల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నాం. అదే కళాశాలలో పనిచేసే అధ్యాపకులనే ఇన్విజలేటర్లుగా నియమిస్తున్నాం. దీంతో పాటు పరీక్షా కేంద్రాలలో మాస్‌కాపీయింగ్‌కు అవకాశం లేకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం.
– ఊక రమేష్‌బాబు, డైరెక్టర్, డీడీఈ, ఎస్వీయూ

నిఘా నీడలోనేనా?

నిఘా నీడలోనేనా?