కాణిపాకం: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సోమవారం శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధి, బుద్ధి సమేత గణపతి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆస్థాన మండపంలో కొలువుదీర్చారు. ఉదయం 10 నుంచి 11 గంటలు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు వ్రతం జరిపించారు. పెద్దసంఖ్యలో భక్తులు వ్రతం ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలోనే రాత్రి వినాయక స్వామివారు స్వర్ణరథం అధిరోహించి మాడవీధుల్లో విహరించారు. భక్తులు కర్పూరహారతులు సమర్పించారు. కార్యక్రమంలో ఈఓ పెంచల కిషోర్ పాల్గొన్నారు.
ఉద్యోగం పేరుతో టోకరా
పలమనేరు : తమ కుమారుడికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ పలమనేరుకు చెందిన ఎంఎస్ రంజిత్ అనే వ్యక్తి రూ.25లక్షలకు టోకరా వేశాడని స్థానిక సాయినగర్‌కు చెందిన విశ్వనాథ్, ప్రభావతి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఈ మేరు చిత్తూరులో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు రాజేష్‌కు బెంగళూరులో భారీ ప్యాకేజీతో ఉద్యోగం ఇప్తిస్తాని రంజిత్ తమ వద్ద రెండు, మూడు విడతలు డబ్బులు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగం ఇప్పించకపోగా, తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడం లేదని వాపోయారు. దీనిపై స్థానిక పోలీసుల ఆశ్రయించినా ప్రయోజనం లేకుండా పోవడంతో ఎస్పీకి విన్నవించినట్లు వెల్లడించారు.
ప్రత్యేక నైపుణ్యమే లక్ష్యం
తిరుపతి అర్బన్: ప్రత్యేక నైపుణ్యం సాధించడానికి ప్రభుత్వ ఉద్యోగులకు కోర్సులను ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్వో నరసింహులు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యంతో సుపరిపాలన పెంపొందించే దిశగా కోర్సులు ఉంటాయని చెప్పారు. ఐ గాట్ కర్మయోగి పోర్టల్ యాప్ ద్వారా రాష్ట ప్రభుత్వం మూడు రకాల కోర్సులను ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు. జిల్లాలో డీడీఓలు అందరూ ఈ యాప్ గురించి అవగాహన చేసుకోవాలని చెప్పారు. ఈ కోర్సులను మార్చి 20వ తేదీ లోపు పూర్తి చేయాలని సూచించారు. లాగిన్ కు సంబంధించిన సమస్యలు తలెత్తితే 9652171785, 9063494729 నంబనర్లలో సంప్రదించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ట్రైనింగ్ అధికారి వెంకటేష్ , సీపీఓ ప్రేమ్‌చంద్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విక్రమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.