అడిగేదెవరు?.. ఆపేదెవరు? | - | Sakshi
Sakshi News home page

అడిగేదెవరు?.. ఆపేదెవరు?

Published Thu, Mar 20 2025 1:51 AM | Last Updated on Thu, Mar 20 2025 1:47 AM

అధికారం మాది.. మేము చెప్పిందే వేదం.. మమ్మల్ని అడిగేవారు లేరు.. ఆపేవారు లేరు అంటూ పెనుమూరులో పచ్చనేతలు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే పలు దందాలు చేస్తున్నారు. నేడు బస్టాండు వేలంలోనూ తమ ప్రతాపం చూపుతున్నారు. వేలం పాటలో పాల్గొనాలంటే టీడీపీ నేతలై ఉండాలని హుకుం జారీ చేశారు. ఈ సంఘటన బుధవారం గంగాధరనెల్లూరు మండలం, పెనుమూరు బస్టాండు వేలంపాటలో చోటుచేసుకుంది.

పెనుమూరు(కార్వేటినగరం) : కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి పెనుమూరులో రెడ్‌బుక్‌ పాలన రాజ్యమేలుతుంది. రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వం భూములను కబ్జా చేసుకున్నారు. ఈ సంఘటన మరవక ముందే బస్టాండ్‌ వేలంలోనూ వారి ప్రతాపం చూపుతున్నారు. వేలం పాటకు వచ్చేవారిని బెదిరించి భయాందోళనకు గురి చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు సైతం టీడీపీ ఏజెంట్లుగా మారి, పచ్చనేతలు తప్ప ఎవరు వేలం పాటలో పాల్గొనకూడదని హుకుం జారీ చేసినట్లు తెలిసింది.

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

పెనుమూరు ఆదాయం పెంపునకు గత ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన నారాయణస్వామి సుమారు రూ.1.08 కోట్ల వ్యయంతో బస్టాండ్‌లో సుమారు 24 దుకాణాలు కలిగిన కాంప్లెక్స్‌ నిర్మాణానికి కృషి చేశారు. అది పూర్తి అయినప్పటికీ ఎన్నికల కోడ్‌ కారణంగా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ప్రస్తుతం ఆ కాంప్లెక్స్‌లో దుకాణాలను అద్దెకు ఇవ్వడానికి వేలం పాటలకు అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీంతో టీడీపీ నేతలు తామే వేలం పాటల్లో పాల్గొనాలని, ఇతరులు పాల్గొనకూడదని హుకుం జారీ చేశారు. అధికారులు కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని వేలం పాటలో ఎవరినీ పాల్గొననీయకుండా అడ్డుకుంటుందని స్థానికులు విమర్శిస్తున్నారు. అంతే కాకుండా వేలం పాటలో పాల్గొనడానికి బ్యాంకుల్లో డీడీలు చెల్లించిన 300 మందిని టీడీపీ నాయకులు, అధికారులతో పాటు బెదిరించి, తిరుపతి నుంచి రప్పించిన 50 మంది గూండాలతో భయందోళనకు గురి చేశారు. అయినప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించి ఏ మాత్రం పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా వేల పాటలు నిర్వహించి, అధికార పార్టీ నాయకులకు కట్టబెట్టారని స్థానిక వ్యాపారులు వాపోతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది. ఒక్కొక్క గదికి నెలకు సుమారు రూ.10 నుంచి రూ.15 వేల వరకు అద్దెరావాల్సి ఉండగా పచ్చనేతలు అతి తక్కువ ధరకే తమ అనుచరులకు అప్పగించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారబలంతో రెచ్చిపోతున్న కూటమి నేతలు

టీడీపీ ఏజెంట్లుగా మారుతున్న అధికారులు

బస్టాండ్‌ వేలంపాటలో ఎవరూ పాల్గొనవద్దని హుకుం

భగ్గుమన్న వర్గ విభేదాలు

వేలం పాటలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే వర్గం వర్స్‌స్‌ టీడీపీ మండల అధ్యక్షుడి రుద్రయ్య వర్గం బాహాబాహీలకు దిగాయి. తమ వర్గం వారికి గదులు లేకుండా చేయడంతో రెచ్చిపోయిన ఇరువర్గాలు గొడవ పడ్డాయి. ఈ క్రమంలో హైకోర్టు న్యాయవాది, టీడీపీ రాష్ట్ర నాయకుడు గద్వాల జగదీష్‌ నిలదీయడంతో ఆయనపై కర్రలతో, రాళ్లతో దాడికి దిగారు. అలాగే ఆయన కారును పెనుమూరు బస్టాండ్‌లో ధ్వంసం చేశారు. దీంతో పెనుమూరు మండలానికి చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌.బీ సుధాకర్‌రెడ్డి ఈ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానని చెప్పడంతో రచ్చ సద్దుమణిగింది.

అడిగేదెవరు?.. ఆపేదెవరు? 1
1/1

అడిగేదెవరు?.. ఆపేదెవరు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement