నగరి: మండలంలోని వీకేఆర్‌పురం గ్రామం వద్ద నగరి–తిరుత్తణి మెయిన్ రోడ్డు సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డీఎస్సీ మహమ్మద్ సయ్యద్ అజీజ్ తెలిపిన కథనం మేరకు.. సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘాలో భాగంగా సోమవారం ఉదయం సీఐ విక్రమ్‌కు రహస్య సమాచారం అందింది. దీనిపై స్పందించిన ఆయన డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, పోలీసులతో కలసి వీకేఆర్‌పురం గ్రామంలో దాడులు చేశారు. తమిళనాడు నుంచి వచ్చి వీకేఆర్ పురంలో స్థిరనివాసం ఏర్పరుచుకున్న ఎ.అబ్బాస్ (39), మండలంలోని ఓజీ కుప్పం గ్రామానికి చెందిన ఓ.మోహన్ (30) నగరి–తిరుత్తణి మెయిన్ రోడ్డు సమీపంలో గంజాయి విక్రయిస్తుండగా అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.32 వేలు విలువచేసే 2.35 కిలోల గంజాయిని, ఒక మోటార్ సైకిల్‌ను, మొబైఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు గంజాయి విక్రయిస్తున్న మరో ఇద్దరు పరారయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మహమ్మద్ సయ్యద్ అజీజ్ మాట్లాడుతూ నగరి సరిహద్దు ప్రాంతం కావడంతో గంజాయి అక్రమ రవాణా, అమ్మడం, కొనడం, సేవించడం పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. ఈ కేసులో ప్రతిభ చూపిన సిబ్బంది ఇంద్ర కుమార్, గోపి, గజేంద్ర, రమేష్, పవన్ కళ్యాణ్‌లను అభినందించారు.