నగరి : మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ మంత్రి ఆర్కేరోజా బుధవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కలిశారు. పలకరింపుల అనంతరం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే అంశాలపై చర్చించినట్లు మాజీ మంత్రి రోజా తెలిపారు.
ఏపీపీజీసెట్–2025కు దరఖాస్తుల ఆహ్వానం
కుప్పం: ద్రవిడ విశ్వవిద్యాలయంలో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో నిర్వహించే ఏపీపీజీసెట్–2025 దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కిరణ్‌కుమార్ తెలిపారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మె స్సీ తదితర పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు ఏపీపీజీసెట్–2025 ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో ఈ నెల 2 నుంచి మే నెల 5వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. అలాగే అపరాధరుసుంతో మే నెల 5 నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు వర్సిటీ డీన్ అకడమిక్ అఫైర్స్ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.
అలసత్వం వహిస్తే చర్యలు
– కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ
చిత్తూరు కలెక్టరేట్ : ఉపాధిహామీ పథకం అమలులో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ హెచ్చరించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లో డ్వామా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధిహామీ పథకంలో మంజూరైన పనుల పురోగతిలో ఏపీడీలు, ఏపీఓలు పూర్తిస్థాయిలో నిమగ్నమై పనిచేయాలన్నారు. జాతీ య గ్రామీణ ఉపాధిహామీ పథకంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రధానంగా భూగర్భ జలాల పెంపునకు చేపట్టిన ఫారమ్ పాండ్ నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రైతులకు అవగాహన కల్పించి ప్రతి మండలంలో మోడల్ ఫారమ్ పాండ్‌లను నాణ్యతతో నిర్మించాలన్నారు. డ్వామా పీడీ రవికుమార్, ఏపీడీ, ఏపీఓలు పాల్గొన్నారు.
వ్యవసాయ సర్వీసులు వెంటనే ఇవ్వండి
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో పెండింగ్ వ్యవసాయ సర్వీసులను వెంటనే విడుదల చేయాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. బుధవారం ఎస్‌ఈ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ఇన్ని రోజులు ట్రాన్స్‌ఫార్మర్లు, మెటీరియల్ కొరత కారణంగా వ్యవసాయ సర్వీసులు విడుదల చేయలేకపోయమన్నారు. ప్రసుత్తం అవన్నీ వచ్చాయని, రైతులకు ఇబ్బందులు లేకుండా పనులు చేయాలన్నారు. సకాలంలో కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతు చేసి పంపాలన్నారు. విద్యుత్ చౌర్యాన్ని నివారించాలన్నారు. వేసవిలో విద్యుత్ అంతరాయం లేకుండా ముందుస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఈఈలు మునిచంద్ర, సురేష్, వాసుదేవరెడ్డి, అమర్‌బాబు, జగదీష్, ఏఓ ప్ర సన్న ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
మామిడి దిగుబడిపై అంచనా
చిత్తూరు రూరల్(కాణిపాకం): జిల్లాలో మామి డి సాధారణ దిగుబడిని ఉద్యానశాఖ అధికారులు రకాల వారీగా అంచనా వేశారు. జిల్లాలో 54,732 హెక్టార్లల్లో పలు రకాలు సాగులో ఉండగా 5,47,320 మెట్రిక్‌ల వరకు దిగుబడి రావచ్చని అధికారుల అంచనా వేశారు. తోతాపురి రకం అత్యధికంగా 42,204 హెక్టార్లు ఉండగా 4,22,040 మెట్రిక్ టన్నులు దిగుబడి రావచ్చని అంచనాలో చూపించారు.
నీలం 3,904 హెక్టార్లకు 39,040 మెట్రిక్ టన్నులు, అల్పో న్సో 2,005 హెక్టార్లకు.. 20,050 మెట్రిక్ టన్నులు, బేనీషా 4,100 హెక్టార్లకు 41,000 మెట్రిక్ టన్నులు, ఇతర రకాలు 2,520హెక్టార్లకు గాను 25,200 మెట్రిక్ టన్నులు రావచ్చని అధికారులు తమ ముందస్తు అంచనాలో పేర్కొన్నారు. అయితే ఈసారి దిగుబడి సాధారణ అంచనా కంటే పెరగవచ్చని జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.