
మహేశ్వరయ్య..మజాకానా!
● పంచాయతీ కార్యదర్శి ఆస్తులు రూ.30 కోట్లు
● ఏసీబీ సోదాల్లో వెలుగుచూసిన వైనం
పలమనేరు : ఆయనో సాధారణ పంచాయతీ కార్యదర్శి.. ఆయనకొచ్చే జీతంతో ఆ కుటుంబానికి సరిపోతుంది. మిగిలేదేమీ పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఆయన అందరిలాంటి వాడు కాదు.. ఏకంగా ఆ చిన్న ఉద్యోగంతోనే రూ.30 కోట్లు సంపాదించి ఔరా అనిపించారు. ఇటీవల చంద్రగిరి పంచాయతీ కార్యదర్శి మహేశ్వరయ్య ఓ కాంట్రాక్టర్ వద్ద రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా వేర్వేరుచోట్ల ఏసీబీ అధికారులు దాడులు చేయగా తిరుపతిలో రెండిళ్లు, రెండుసైట్లు, రెండు కార్లు, కేజీ బంగారం, రెండు కిలోల వెండి, 5 లక్షల నగదు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇవికాక బెంగళూరులో అపార్ట్‌మెంట్, బద్వేలో బంధువులపై భూములు వెలుగు చూశాయి. తాజాగా రెండు రోజుల క్రితం ఏసీబీ అధికారులు పలమనేరు, గంగవరంలలో సోదాలు చేశారు. ఇక్కడ సాయినగర్‌లో షాపింగ్ కాంప్లెక్స్, జీఫ్లస్ ఇళ్లు, కూర్నిపల్లి వద్ద ఫామ్‌హౌస్ పక్కనే నాలుగెకరాల పొలాన్ని గుర్తించారు. ఈ ఆస్తులన్నీ చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.