
‘పుర’ పనులపై విజిలెన్స్ కొరడా
● 5 మంది అధికారులపై చర్యలు ● రూ.26 లక్షల రికవరీ?
పుంగనూరు : పురపాలిక పరిధిలో 2014–15 సంవత్సరంలో జరిగిన అభివృద్ధి పనుల్లో నాణ్యత లేదని విజిలెన్స్ అధికారులు పదేళ్ల తరువాత నిద్రలేచి జూలు విధిల్చారు. దీనికి సంబంధించి 5 మందితో పాటు మరో ఇద్దరు అధికారులు, ఇద్దరు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఈనెల 7న ఆదేశాలు జారీ చేస్తూ 5 మంది ఇంజినీర్లను బాధ్యులుగా చేశారు. ఈ ఆదేశాలు మంగళవారం పురపాలికకు చేరాయి. మున్సిపాలిటీలో పనిచేసి బదిలీపై వెళ్లిన, రిటైర్డ్ అయిన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆదేశాలు రావడంతో ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పదేళ్ల కిందట చేసిన పనుల్లో నాణ్యత లేదని విజిలెన్స్ వారు పంపిన నివేదికలపై ప్రస్తుతం చర్యల చేపట్టడంతో ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పనుల నిర్వహణలో భాగస్వాములైన ఇంజనీర్లు డీఈఈ గా పని చేసిన నారాయణస్వామి, అలాగే విశ్రాంత డీఈఈ పద్మనాభరావు, విశ్రాంత ఏఈ సుబ్బరామయ్యతో పాటు ప్రస్తుత డీఈఈలు ఇతర మున్సిపాలిటీల్లో పని చేస్తున్న రవీంద్రారెడ్డి, కృష్ణకుమార్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా సదరు పనుల్లో నాణ్యత లేని కారణంగా సుమారు రూ.26 లక్షలు ఆ ఉద్యోగుల నుంచి రికవరీ చేయనున్నట్లు సమాచారం. కాగా 10 ఏళ్ల తరువాత ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.