
ఖైదీల జీవనోపాధికి బ్యాంకు రుణాలు
చిత్తూరు అర్బన్ : ఖైదీల్లో పరివర్తన తీసుకురావడానికి జైలు నుంచి విడుదలైన తరువాత వాళ్లకు బ్యాంకు రుణాలను మంజూరు చేస్తామని కలెక్టర్ సుమిత్‌కుమార్ హామీ ఇచ్చారు. బుధవారం చిత్తూరు నగరంలోని జిల్లా జైలులో ఖైదీలకు సంకల్ప–స్కిల్ ట్రైనింగ్‌లో భాగంగా మల్టీస్కిల్ ట్రేడ్ కింద శిక్షణ పొందిన ఖైదీలకు సర్టి ఫికెట్లను అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తెలిసీ తెలియక ఆవేశంలో చేసిన తప్పులకు శిక్ష ఒక్కటే పరిష్కారం కాదన్నారు. సత్ప్రవర్తనతో జైలు నుంచి విడుదలయ్యాక డీఆర్‌డీఏ, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ ఆధ్వర్యంలో ఖైదీలకు శిక్షణ ఇవ్వడంతో పాటు సప్తగిరి గ్రామీణ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఎస్‌బీఐ ద్వారా రుణాలు అందిస్తామన్నారు. జిల్లా జైళ్ల పర్యవేక్షణాధికారి వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తొలి బ్యాచ్‌గా చిత్తూరు జైల్లో 34 మందికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చామన్నారు. ఖైదీల జీవనోపాధుల కోసం మెరుగైన శిక్షణ ఇవ్వడంతో పాటు ఇక్కడ ఓపెన్ స్కూల్ ద్వారా చదివే అవకాశం కల్పిస్తున్నామన్నారు. డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి గుణశేఖర్, న్యాక్ ఏడీ సతీష్ పాల్గొన్నారు.