
పార్టీ మారారంటూ తప్పుడు ప్రచారం
బంగారుపాళెం: ‘వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను భోజనానికి ఆహ్వానించారు. వారికి జనసేన కండువాలు కప్పి పార్టీలో చేరినట్లుగా ఆపార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్‌కుమార్ అన్నారు. సోమవారం పార్టీ మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని కూర్మాయిపల్లెకు చెందిన సుధాకర్‌రెడ్డి, గజేంద్రరెడ్డి, వాసుదేవరెడ్డి, మొగిలిరెడ్డి వైఎస్సార్‌సీపీని వీడి జనసేన పార్టీలో చేరినట్లు సోషియల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసుకున్నారన్నారు. ఆది వారం ఓ కార్యక్రమం ఉందని, మీరు తప్పకుండా భోజనానికి రావాలని వైఎస్సార్‌సీపీకి చెందిన కార్యకర్తలను ఆహ్వానించారన్నారు. దీంతో వారు వెళ్లగానే బలవంతంవగా వారి మెడలో కండువాలు వేసి ఫొటోలు తీసి, జనసేన పార్టీలో చేరినట్లుగా తప్పుడు ప్రచారం చేసుకోవడం సమంజసం కాదన్నారు. ఇలాంటి రాజకీయాలను జనసేన నాయకులు మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ కుమార్‌రాజా, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, వైస్ ఎంపీపీ శిరీష్‌రెడ్డి, కూర్మాయిపల్లె సర్పంచ్ హేమలత, బాబురెడ్డి, పాలాక్షిరెడ్డి, ఽథామస్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూకాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండాయి. క్యూలైన్ ఏటీజేహెచ్ వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 79,100 మంది స్వామిని దర్శించుకున్నారు. 32,791 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కాను కల రూపంలో హుండీలో రూ.3.52 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.
22 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 22 నుంచి మే 10వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు వర్సిటీ అధికారులు కళాశాలలకు పరీక్షల షెడ్యూల్ పంపించారు. విద్యార్థులకు ఈ నెల 19 నుంచి హాల్ టికెట్లు అందజేయనున్నారు.