
ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో అనర్థం
చిత్తూరు అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారం మెరుగైన పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక లక్ష్యంతో కార్యక్రమాలను చేపడుతోందని కలెక్టర్ సుమిత్‌కుమార్ పేర్కొన్నారు. ‘ఈ–చెక్ ’థీమ్‌తో నిర్వహించిన కార్యక్రమాన్ని చిత్తూరు నగరపాలక కార్యాలయంలో కలెక్టర్, ఎమ్మెల్యే జగన్ మోహన్, మేయర్ అముద, చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, కమిషనర్ నరసింహ ప్రసాద్ ప్రారంభించారు. చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ‘ఈ–చెక్’ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 5 వేల మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తి అవుతుందని అంచనా ఉందన్నారు. వీటిని సరైన పద్ధతుల్లో రీసైక్లింగ్ చేయకపోవడం వల్ల ప్రమాదకర మూలకాలు భూమి, వాతావరణంలో కలుస్తున్నాయన్నారు. ఈ–వేస్ట్ (ఎలక్ట్రానిక్ పరికరాలు) నియంత్రించడంలో భాగంగా రానున్న నెల రోజుల పాటు క్షేత్ర స్థాయిలో చేపట్టనున్న ఈ–చెక్ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తమ గృహాలు, దుకాణాల్లోని వృథాగా ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాల పరిధిలోని సచివాలయాల్లో అప్పగించాలని కోరారు. అనంతరం ప్రజా ప్రతినిధులు అధికారులు ‘స్వచ్ఛ ప్రతిజ్ఞ’ చేశారు. జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, ఎంహెచ్వో డా. లోకేష్, నగర పాలక అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.