
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో దేశ వ్యాప్తంగా చాలా కంపెనీలు కుదేలయ్యాయి. ఆదాయాలు లేక చిన్న పెద్దా కంపెనీలు ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయాయి. దీనికి సంబంధించిన ప్రభుత్వం షాకింగ్ విషయాలను వెల్లడించింది.కరోనా మహమ్మారి కారణంగా మన దేశంలో ఏకంగా 10వేలకుపైగా కంపెనీలు మూతపడ్డాయని తెలిపింది. 2020-21లో వ్యాపారాలను ఆపేసిన నమోదిత కంపెనీల వివరాలను తెలియజేయాల్సిందిగా లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ వివరాలు తెలియజేశారు.
కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు జరగకపోవడమే ఇందుకు కారణమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గతేడాది ఏప్రిల్ నుంచి 2021 ఫిబ్రవరి వరకు దేశంలో 10113 కంపెనీలు స్వచ్ఛందంగా మూతపడ్డాయని ప్రభుత్వం వెల్లడించింది. 2014 కంపెనీల చట్టంలోని సెక్షన్ 248(2) కింద ఈ కంపెనీలను మూసివేశారు. అత్యధికంగా ఢిల్లీలో 2,395 కంపెనీలు మూతపడగా.. ఉత్తరప్రదేశ్ 1,936 కంపెనీలతో ఆ తర్వాతి స్థానంలో ఉంది. అలాగే తమిళనాడులో 1,322, మహారాష్ట్రలో 1,279, కర్ణాటకలో 836, చండీగఢ్‌లో 501, రాజస్థాన్‌లో 479, తెలంగాణలో 404, కేరళలో 307, ఝార్ఖండ్‌లో 137, మధ్యప్రదేశ్‌లో 111, బిహార్‌లో 104 కంపెనీలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ కాలంలో గుజరాత్ కేవలం 17 కంపెనీలు మాత్రమే మూతపడగా, హరియాణాలో ఒక్కటి కూడా మూతపడలేదు.
Comments
Please login to add a commentAdd a comment