న్యూఢిల్లీ: మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా వడ్డీ బకాయిల చెల్లింపుకింద ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఈక్విటీని జారీ చేయనుంది. సుమారు రూ. 16,133 కోట్లకుగాను రూ. 10 ముఖ విలువగల దాదాపు 1,613.32 కోట్ల షేర్లను కేటాయించనుంది. స్థూల సర్దుబాటు ఆదాయం(ఏజీఆర్) వాయిదా, స్పెక్ట్రమ్ వేలం చెల్లింపులపై వడ్డీ కింద వొడాఫోన్ ఐడియా ఈక్విటీ కేటాయింపునకు ప్రతిపాదించింది. ఇందుకు తాజాగా కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. వెరసి వడ్డీ.. ఈక్విటీగా మార్పు చెందనుంది.
ఇది కంపెనీ మొత్తం విస్తారిత ఈక్విటీలో 33.44 శాతం వాటాకు సమానంకానుంది. కంపెనీ మొత్తం చెల్లించిన మూలధన రూ. 48,252 కోట్లను మించనుంది. కంపెనీలో ప్రమోటర్లు వొడాఫోన్ గ్రూప్ వాటా 32.29 శాతానికి, ఆదిత్య బిర్లా గ్రూప్ వాటా 18.07 శాతానికి చేరనున్నాయి. 2018లో విలీనం తదుపరి 43 కోట్ల మొబైల్ వినియోగదారులతో వొడాఫోన్ ఐడియా 35 శాతం మార్కెట్ వాటాను పొందింది. తద్వారా అతిపెద్ద కంపెనీగా నిలిచిన సంస్థ ప్రస్తుతం 24.3 కోట్లమంది కస్టమర్లతో 21.33 శాతానికి మార్కెట్ వాటాకు పరిమితమై మూడో ర్యాంకుకు చేరింది. ఈ వార్తల నేపథ్యంలో వొడాఫోన్ షేరు బీఎస్‌ఈలో 4 శాతం పతనమై రూ. 7.94 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment