![2 Members Of Family Departed Road Accident In Nalgonda - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/16/rao.jpg.webp?itok=cz81c0Tp)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,చింతపల్లి(నల్లగొండ): అప్పటివరకు సోదరుడి కుమార్తె పుట్టిన రోజువేడుకలో ఆనందంగా గడిపారు. తిరిగి కారులో ఇంటికి పయనమైన వారిని జేసీబీ రూపంలో మృత్యువు కబళించింది. హైదరాబాద్–నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై మండల పరిధిలోని కుర్మేడు వద్ద మంగళవారం రాత్రి కారు – జేసీబీ ఢీకొన్న ఘటనలో తండ్రితోపాటు ఐదేళ్ల వయసున్న కుమార్తె మృతిచెందింది. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
చింతపల్లి మండల పరిధిలోని హోమంతాలపల్లి గ్రామానికి చెందిన వలమల రమేశ్ హైదరాబాద్‌లో లారీ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రమేశ్, సంతోష దంపతులు.. కుమార్తె అక్షర(5)తో పాటు నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ మండలం బైరాపురం గ్రామానికి చెందిన సమీప బంధువులు శ్రీశైలం, సంతోష దంపతులు మంగళవారం ఉదయం రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం అందుగుల గ్రామంలో రమేశ్ సోదరుడి కుమార్తె పుట్టిన రోజు వేడుకకు కారులో వెళ్లారు.
వేడుక ముగియడంతో రమేశ్ స్వగ్రామమైన హోమంతాలపల్లి గ్రామానికి వెళ్లి తిరిగి కారులో హైదరాబాద్‌కు పయనమయ్యారు. కుర్మేడు గేటు సమీపంలోకి రాగానే వీరి కారును ఎదురుగా వస్తున్న జేసీబీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేశ్, అతని కూతురు అక్షరకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో కూతురు మృతిచెందింది.
రమేశ్‌ను కామినేని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. భార్య సంతోషతోపాటు, శ్రీశైలం, సంతోష దంపతులకు కూడా గాయాలు కావడంతో వారిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment