
అమలాపురం టౌన్: అమలాపురం విధ్వంసం ఘటనల కేసుల్లో మరో 20 మందిని అరెస్టు చేసినట్టు కోనసీమ జిల్లా ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి శనివారం తెలిపారు. వీరిని రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. వీరితో కలిపి ఇప్పటి వరకూ ఈ కేసుల్లో అరెస్టయిన వారి సంఖ్య 111కి చేరిందన్నారు.
అమలాపురం అల్లర్లకు సంబంధించి 7 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా, ఇప్పటి వరకూ ఆరు ఎఫ్‌ఐఆర్‌లలో నిందితులను అరెస్టు చేశామని, మరిన్ని అరెస్టులుంటాయని తెలిపారు. నిందితుల ఒప్పుకోలు, ప్రత్యక్ష సాక్షులు, సీసీ ఫుటేజీలు, గూగుల్ ట్రాక్, టవర్ లొకేషన్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఈ అరెస్టులు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.
మరో వారం పాటు 144 సెక్షన్
కోనసీమ జిల్లాలో విధించిన 144 సెక్షన్, పోలీస్ సెక్షన్–30 అమలును మరో వారం పాటు కొనసాగిస్తున్నామని ఎస్పీ సుబ్బారెడ్డి చెప్పారు. సోషల్ మీడియా నియంత్రణ కోసం 15 మండలాల్లో విధించిన ఇంటర్నెట్ నిలిపివేతను మండలాల వారీగా ఉపసంహరించేలా ఉత్తర్వులిస్తున్నామని తెలిపారు.
ఇప్పటికే 15 మండలాలకు గాను 11 మండలాల్లో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం అమలాపురం రూరల్, అల్లవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాల్లో మాత్రమే ఇంటర్నెట్ సేవల నిలిపివేతను కొనసాగిస్తున్నామని, ఈ నెల 7న ఈ నాలుగు మండలాల్లోనూ నిలిపివేతను ఉపసంహరిస్తామని ఎస్పీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment