
కాకినాడ లీగల్/కంబాలచెరువు (రాజమహేంద్రవరం): బాలిక (16)పై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.3,500 జరిమానా విధిస్తూ కాకినాడ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎల్.వెంకటేశ్వరరావు సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని కాతేరు గ్రామం, శౠంతినగర్‌కు చెందిన బాలిక నగరంలోని ఒక వస్త్ర దుకాణంలో పని చేసేది. షాపులో పని పూర్తయ్యాక తిరిగి రాత్రి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది.
నగరంలోని ఆర్యాపురానికి చెందిన ఆటో డ్రైవర్ తానేటి రామచంద్ర వరప్రసాద్ ఆమెను తన ఆటోలో ఎక్కించుకున్నాడు. మార్గం మధ్యలో మరో ఆటో డ్రైవర్ తానేటి సుధాకర్‌బాబును కూడా ఆటోలో ఎక్కించుకున్నాడు. వారిద్దరూ కలిసి ఆ బాలికను నేరుగా కాతేరు వెళ్లే రోడ్డులో కాకుండా పేపర్ మిల్లు వెనుక ఉన్న గోదావరి గట్టు వైపు తీసుకెళ్లారు. ఆ ఇద్దరు దుర్మార్గులు తనను బ్లేడు, కత్తితో బెదిరించి, పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని ఆ బాలిక 2016 జూన్ 6న రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నిందితులు రామచంద్ర వరప్రసాద్, సుధాకర్‌బాబుపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై అప్పటి సెంట్రల్ జోన్ డీఎస్పీ కులశేఖర్ దర్యాప్తు చేపట్టారు. కోర్టు విచారణలో తానేటి సుధాకర్‌బాబుపై నేరం రుజువు కావడంతో ఐపీసీ 376 (2)ఎన్ ప్రకారం పదేళ్ల జైలు, రూ.1,000 జరిమానా, ఐపీసీ 376డి ప్రకారం 20 ఏళ్ల జైలు, రూ.1,000 జరిమానా, ఐపీసీ 377 ప్రకారం ఐదేళ్ల జైలు, రూ.1000 జరిమానా, ఐపీసీ 506 ప్రకారం ఏడాది జైలు, రూ.500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. నాలుగు సెక్షన్లకు ఏకకాలంలో జైలుశిక్ష అమలు చేయాలని తీర్పులో పేర్కొన్నారు. సరైన ఆధారాలు లేకపోవడంలో తానేటి రామచంద్ర వరప్రసాద్‌పై కేసు కొట్టి వేశారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎండీ అక్బర్ అజాం ప్రాసిక్యూషన్ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment