
జైపూర్: రాజస్తాన్‌లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు సుమారు 234 కిలోల నల్లమందును స్వాధీనం చేసుకుని.. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ ఏడాదిలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే ప్రథమం. ఈ నెల 19న రాష్ట్రంలోని చిత్తోర్‌గఢ్ జిల్లాలోని షాది గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఎన్‌సీబీ డిప్యూటి డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా మాట్లాడుతూ.. ‘జోధ్‌పూర్ జోనల్ యూనిట్‌కు చెందిన ఓ బృందం ఆర్ లాల్ అనే వ్యక్తి నివాసప్రాగంణంపై దాడి చేసి 233.97 కిలోగ్రాముల నల్లమందును స్వాధీనం చేసుకుంది. ఇందుకు సంబంధించి భిల్వారా జిల్లాకు చెందిన ఎంకే ధాకాడ్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశాం. నిందితుల వద్ద నుంచి ఓ ఎస్‌యూవీని కూడా స్వాధీనం చేసుకున్నాం’ అని వెల్లడించారు. (ఇది న్యాయమేనా?!)
అంతేకాక ఈ ఏడాది ఇంత భారీ మొత్తంలో నల్లమందు పట్టుబడటం ఇదే ప్రథమం అన్నారు మల్హోత్రా. నిందితులు దీన్ని చిత్తోర్‌గఢ్‌లోని చట్టబద్దమైన సాగు ప్రాంతం నుంచి కొన్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి జోధ్‌పూర్‌కు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నాం అన్నారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌కు చెందిన మాదకద్రవ్యాల వ్యాపారులు ఇందులో పాలు పంచుకున్నరని తెలిపారు. నల్లమందును గసగసాల నుంచి పొందిన ఎండిన రబ్బరు పాలతో తయారు చేస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్.. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గసగసాల సాగుకు అనుమతిచ్చింది. ఈ క్రమంలో మధ్యవర్తులు, రైతుల దగ్గర నుంచి దీన్ని కొనుగోలు చేసి అక్రమమార్గల ద్వారా తరలించే ప్రయత్నం చేస్తూ పట్టబడ్డారు. ఈ నల్లమందు నుంచి హెరాయిన్‌ను తయారు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment