మండ్య: ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులను నీటికుంట మింగేసింది. వారి తల్లులకు కడుపుకోత మిగిల్చింది. ఈ విషాద ఘటన పాండవపుర తాలూకా, బళెఅత్తిగుప్పె గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మహదేవప్ప, భారతి దంపతుల కుమారులు చంద్రు(11), కార్తీక్(9), మల్లికార్జున, సుమా దంపతుల కుమారుడు రితేష్(8)లు ఇంటి వద్ద ఆడుకుంటూగ్రామ సమీపంలోని నీటికుంటలో ఈతకు కొట్టడానికి వెళ్లారు. నీరు లోతుగా ఉన్న ప్రదేశంలో చిక్కుకుపోయి జలసమాధి అయ్యారు. సమీపంలోని రైతులు అటుగా వెళ్తూ బావిలోకి తొంగి చూడగా బాలుడి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. దీంతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు.
బావి లోపలకు దిగి గాలించగా మిగతా ఇద్దరు బాలురు విగతజీవులై కనిపించారు. దీంతో తల్లిదండ్రుల్లో ఒక్కసారిగా దుఃఖం ఉప్పొంగింది. మృతదేహాలపై పడి రోదించడం అందరినీ కలచి వేసింది. వారిని సముదాయించేందుకు ఎవరితరం కాలేదు. పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు దర్యాప్తు చేపట్టారు. ఎమ్మెల్యే సి.ఎస్.పుట్టరాజు, కలెక్టర్ అశ్వథి, తహసీల్దార్ ప్రమోద్ పాటిల్, సీఐ కే.ప్రభాకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment