పాట్నా: బిహార్‌లో విషాదం నెలకొంది. దసరా ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దుర్గా పూజ మండపం వద్ద జరిగిన తొక్కిసలాట ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. మరో 10మందికి పైగా గాయపడ్డారు. గోపాల్‌గంజ్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
వివరాలు.. దేవి నవరాత్రుల సందర్భంగా రాజా దళ్ ప్రాంతంలో దుర్గా పూజ వేడుకలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఒకేసారి ఎక్కువ మంది గుమిగూడటంతో మండపం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో అయిదేళ్ల బాలుడు, ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
దీనిపై గోపాల్ గంజ్ ఎస్పీ స్వర్ణ ప్రభాత్ మాట్లాడుతూ.. సోమవారం రాత్రి 8.30 గంటలకు రాజాదలళ్ పూజా పండల్ గేటు దగ్గర తొక్కిసలాట జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో ఓ బాలుడు కిందపడి పోవడంతో అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు మహిళలు సైతం కిందపడిపోయారన్నారు. అదే సమయంలో భక్తులు ప్రసాదం కోసం బారులు తీరడంతో తొక్కిసలాట జరిగిందని చెప్పారు.
దీంతో ముగ్గురికి ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లారని,, ఆసుపత్రికి తరలించేలోపు ముగ్గురు మరణించారని పేర్కొన్నారు. వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని నియంత్రించినట్లు చెప్పారు. మరో 10కి పైగా గాయపడగా.. వారిని సదర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అయితే భక్తుల రద్దీని నియంత్రించేందుకు మండపం వద్ద ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడమే తొక్కిసలాటకు దారితీసిందని పోలీసులు తెలిపారు.
చదవండి: తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి
Comments
Please login to add a commentAdd a comment