
విశాఖ లీగల్: బాలికపై లైంగిక దాడికి యత్నించిన యువకునికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.100 జరిమాన విధిస్తూ విశాఖలోని పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు. జరిమాన చెల్లించని పక్షంలో అదనంగా నెల రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి..తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడుకి చెందిన నిందితుడు ఏడిద క్రాంతి (33) విశాఖలోని బుచ్చిరాజుపాలెంలోని బంధువుల ఇంట్లో ఉంటూ ఓ సమోసా తయారీ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు.
బాధితురాలు (10) ఎన్‌ఏడీ దగ్గర గాంధీనగర్ పోలీస్ కాలనీ నివాసి. నిందితుడు పనిచేసే ప్రాంతంలో బాలిక స్నేహితులతో సైకిల్ తొక్కేది. బాలిక కదలికలను కనిపెట్టిన నిందితుడు 2020 అక్టోబర్ 26న ఆమెకు మాయమాటలు చెప్పి సమీపంలోని రైల్వేట్రాక్ దగ్గరకు తీసుకువెళ్లాడు. సైకిల్‌పై వెళుతున్న బాలికను తాకుతూ లైంగిక దాడికి యత్నించగా భయకంపితురాలైన ఆమె కేకలు వేసింది.
పక్కనే ఉన్న ఓ యువకుడు వచ్చి బాలికను రక్షించాడు. నిందితుడు పరారయ్యాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. కేసు విచారణ జరిపిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో పై విధంగా నిందితుడికి శిక్ష విధించారు.
Comments
Please login to add a commentAdd a comment