పంజగుట్ట: రాష్ట్ర పోలీసు చరిత్రలో అత్యంత అరుదైన కేసు రికార్డులకు ఎక్కింది. గతంలో రాష్ట్రంలోనే అత్యధిక కేసులు, దేశంలోనే రెండో బెస్ట్ ఠాణా రికార్డుల్ని సొంతం చేసుకున్న పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో గురువారం నమోదైన ఈ కేసు వివరాలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. గడిచిన 11 ఏళ్లుగా తనపై 143 మంది అత్యాచారానికి పాల్పడ్డారంటూ సోమాజిగూడలో నివసిస్తున్న ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ జారీ అయింది. రికార్డు స్థాయిలో 42 పేజీలతో ఇది జారీ కావడం గమనార్హం. ఇందులో యువతి పేర్కొన్న ప్రకారం.. 138 మంది ప్రముఖు లు, విద్యార్థి సంఘాల నేతల పేర్లు, మరో ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులంటూ పోలీసులు రిజిస్టర్ చేశారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం సెట్టిపాలెం గ్రామానికి చెందిన బాధితురాలికి (25) 2009లోనే వివాహమైంది.
ఆమె మైనర్‌గా ఉండగానే మిర్యాలగూడకు చెందిన కె.రమేశ్‌తో పెళ్లి జరిగింది. ఆమె భర్త, ఆడపడుచు, అత్త, మామ, సోదరులతో పాటు వారి బంధువులు దాదాపు 20 మంది శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారు. ఈ విషయాన్ని బాధితురాలు 9 నెలల తర్వాత తన తల్లికి చెప్పింది. 2010లో భర్త నుంచి విడాకులు తీసుకున్న యువతి పుట్టింటికి చేరుకుని తన చదువు కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే ఓ విద్యార్థి సంఘం నాయకుడు ఈమెపై అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె నగ్న వీడియోలు, ఫొటోలు తీసి బెదిరించాడు. ఇతనితోపాటు గడిచిన 11 ఏళ్లలో అనేక మంది నటులు, యాంకర్లు, ప్రముఖుల పీఏలు తనను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్లారని, వారితోపాటు స్నేహితులు, బంధువులు, కుటుంబీకులు కలిసి తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
5 వేల సార్లు అత్యాచారం..
ఇప్పటివరకు 5 వేల సార్లు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె పోలీసులకు తెలిపింది. వీరిలో 138 మంది పేర్లు తన ఫిర్యాదులో పొందుపరిచిన బాధితురాలు గుర్తుతెలియని మరో ఐదుగురు ఉన్నట్లు వెల్లడించింది. వీళ్లంతా తన ఫొటోలు, వీడియోలు యూట్యూబ్‌లో పెడతానని భయపెట్టేవారని, బలవంతంగా అఘాయిత్యాలకు పాల్పడ్డారని పోలీసుల వద్ద వాపోయింది. తాము చెప్పినట్లు వినకపోతే గన్‌తో కాల్చేస్తామని, ముఖంపై యాసిడ్ పోస్తామని కొందరు బెదిరించేవారని, తనతో కూడా బలవంతంగా మద్యం తాగించేవారని, కొన్ని సందర్భాల్లో తాను గర్భవతిని అయ్యానని, ఆ దుండగులే బలవంతంగా గర్భం తీయించారని తెలిపింది.
దళితురాలినైన తనను కులం పేరుతో దూషించేవారని, వయాగ్రా ట్యాబ్లెట్స్ వేసుకుని మరీ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ బాధలు భరించలేకపోయిన తాను గాడ్ పవర్ ఫౌండేషన్ సంస్థ వారిని కలిశానని, వారిచ్చిన ధైర్యం, సహకారంతోనే పోలీసులను ఆశ్రయించానని తెలిపింది. ఈ దురాగతాలకు పాల్పడిన వారిలో కొందరు తనపై హత్యాయత్నం చేశారని, ప్రస్తుతం తనకు ప్రాణహాని ఉందని వెల్లడించింది. బాధితురాలు ఫిర్యాదు అందించేందుకు బురఖా ధరించి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు 42 పేజీలతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించిన పంజగుట్ట అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వాంగ్మూలం నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment