ఒకే కుటుంబంలో ఆరుగురిని నరికేసిన మానవ మృగం  | 6 Family Members Assassinated In Pendurthi Juttada Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబంలో ఆరుగురిని నరికేసిన మానవ మృగం 

Published Thu, Apr 15 2021 9:22 AM | Last Updated on Fri, Apr 16 2021 11:20 AM

6 Family Members Assassinated In Pendurthi Juttada Visakhapatnam - Sakshi

భార్య, పిల్లల మృతదేహాల వద్ద కన్నీటి పర్యంతమైన విజయ్‌, హంతకుడు అప్పలరాజు

సాక్షి, విశాఖపట్నం: నగర శివారులోని వాలిమెరక జుత్తాడ గ్రామం గురువారం ఉదయం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పాతకక్షల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని కిరాతకంగా హత్య చేయడంతో విషాదఛాయలు అలముకున్నాయి. జుత్తాడ నుంచి విజయవాడ వెళ్లి నివసిస్తున్న సివిల్‌ కాంట్రాక్టర్‌ బొమ్మిడి విజయ్‌కిరణ్‌ కుటుంబ సభ్యులు ఆరుగురిని అదే గ్రామానికి చెందిన బత్తిన అప్పలరాజు అతి కిరాతకంగా హత్య చేశాడు. ఉదయం 5.45 గంటల సమయంలో వాకిలి కడిగేందుకు బయటికి వచ్చిన విజయ్‌ అత్త అల్లు రమాదేవి (63)పై అక్కడే మాటువేసి ఉన్న అప్పలరాజు ఒక్క ఉదుటున వచ్చి ఈత కల్లు కత్తితో దాడి చేశాడు.

ఈ హఠాత్పరిణామం నుంచి కోలుకోకముందే మెడపై వేటు పడటంతో ఆమె కుప్పకూలిపోయింది. చేతిని నరికేసి.. ఇంటి లోపలికి వెళ్లి నిద్రలో ఉన్న విజయ్‌ భార్య బొమ్మిడి ఉషారాణి (35), ఆమె ఇద్దరు పిల్లలు బొమ్మిడి ఉదయనందన్‌(02), బొమ్మిడి రిషిత (06 నెలలు)ను కిరాతకంగా హత్య చేశాడు. పిల్లలిద్దరి మెడపై బలంగా కత్తితో వేటేశాడు. ఉషారాణి పొట్టపై విచక్షణారహితంగా నరికి పేగులు బయటికి తీసేశాడు. ఈ హఠాత్పరిణామానికి నిద్రలేచిన విజయ్‌ మేనత్త నెక్కళ్ల అరుణ (45) బాత్‌రూమ్‌లో ఉన్న విజయ్‌ తండ్రి బమ్మిడి రమణ (63) వద్దకు పరుగులు తీసింది. బాత్‌రూమ్‌ డోర్‌ కొట్టింది. అంతలో ఆమె మెడపై దాడి చెయ్యడంతో రమణ డోర్‌ తీసిన వెంటనే అరుణ కుప్పకూలిపోయింది. ఏం జరుగుతుందో ఊహించేలోపే రమణపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఇష్టం వచ్చినట్లు నరకడంతో ఇల్లంతా రక్తపు మడుగులా మారిపోయింది.



చంపేశా.. తీసుకెళ్లండి..
కుటుంబంలో అందర్నీ కత్తితో అతి కిరాతకంగా నరికేసి, అందరూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత.. బయటకు వచ్చిన అప్పలరాజు.. రమాదేవి మృతదేహం పక్కనే అరగంట సేపు కూర్చున్నాడు. ఆ తర్వాత 100 నంబర్‌కు డయల్‌ చేశాడు. ‘జుత్తాడ గ్రామంలో ఆరుగురిని చంపేశాను. నేను ఇక్కడే ఉన్నాను. లొంగిపోతాను’ అంటూ తాను చేసిన నరమేధం గురించి చెప్పగా.. అక్కడి నుంచి పెందుర్తి పోలీసులకు సమాచారం అందడంతో వారు హుటాహుటిన వచ్చి అప్పలరాజును అదుపులోకి తీసుకున్నారు.

పెళ్లి కోసం విజయవాడ నుంచి వచ్చి.. 
విజయ్‌ మేనత్త నక్కెళ్ల అరుణ బంధువు కుమారుడు సాయి వివాహం ఈ నెల 17న శివాజీపాలెంలో జరగనుంది. పెళ్లి కబురు చెప్పేందుకు శివాజీపాలెం నుంచి బుధవారం ఉదయం అరుణ జుత్తాడకు చేరుకుంది. పెళ్లికి హాజరయ్యేందుకు విజయవాడ నుంచి విజయ్‌ కిరణ్‌ భార్య ఉషారాణి, ఇద్దరు పిల్లలు, తల్లి రమాదేవితో కలిసి బుధవారం మధ్యాహ్నం గ్రామానికి చేరుకుంది. విజయ్‌ మాత్రం తన పెద్ద కుమారుడు అఖిల్‌తో విజయవాడలోనే ఉండిపోయాడు. తన ఇంటికి వెళ్తున్న సమయంలో అప్పలరాజు తారసపడగా.. విజయ్‌ భార్య నవ్వుతూ పలకరించిందని సమీప బంధువులు చెబుతున్నారు. అప్పటికే కక్ష పెంచుకున్న అప్పలరాజు వారి రాకతో మరింత రగిలిపోయి.. ఈ నరమేధానికి పాల్పడ్డాడని బంధువులు చెబుతున్నారు. అభం శుభం తెలియని ఆరు నెలల చిన్నారి రిషిత పైనా తన కర్కశత్వాన్ని ప్రదర్శించి.. శరీరాన్ని ముక్కలు చేసేసిన హృదయ విదారక దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరయ్యారు.


మృతులు రమాదేవి, రమణ, రిషిత, ఉషారాణి, ఉదయనందన్‌, అరుణ (ఫైల్‌) 

బంధువుల ఆందోళన
విజయవాడ నుంచి సాయంత్రం 4 గంటలకు జుత్తాడకు విజయ్‌కిరణ్‌ తన పెద్దకుమారుడు అఖిల్‌తో కలిసి చేరుకోగానే ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆరుగురితోపాటు హంతకుడి శవాన్ని తగలబెట్టాలంటూ బంధువులు ఆందోళనకు దిగారు. విజయ్‌ ఇంటి పక్కనే ఉన్న హంతకుడు అప్పలరాజు సోదరుడి ఇంటి తలుపులు పగలగొట్టేందుకు విజయ్‌ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్‌లో విజయ్‌తో మాట్లాడి ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఘటనా స్థలికి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెళ్లి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న విజయ్, బంధువులతో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతదేహాల్ని కేజీహెచ్‌కు తరలించారు.

హత్యకు గురైంది విజయవాడ వారే
గుణదల (విజయవాడ తూర్పు) : విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో హత్యకు గురైన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురూ విజయవాడ వాసులే. మాచవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బ్రహ్మానందరెడ్డి నగర్‌ ప్రాంతానికి చెందిన వారు. ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వెళ్లారు. వీరు సుమారు 20 ఏళ్ల కిందట విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. విషయం తెలిసిన బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనలో ముక్కు పచ్చలారని ఇద్దరు పసికందులు సైతం మృత్యు ఒడికి చేరటం పలువురిని కలిచి వేసింది.  

నా క్షోభ విజయ్‌కి  తెలియాలనే చంపేశా
పోలీసుల అదుపులో ఉన్న హంతకుడు అప్పలరాజులో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించడం లేదు. ‘నా కూతురు విషయంలో విజయ్‌ వల్ల నా కుటుంబం, బంధువులు తీరని మానసిక క్షోభకు గురయ్యాం. ఊళ్లో తలెత్తుకోలేకపోయాం. ప్రతి రోజూ నరకం అనుభవిస్తున్నాం. మేము పడే బాధ వాడికి తెలియాలనే.. వాడిని వదిలేసి.. కుటుంబం మొత్తాన్ని చంపేశాను’ అని అక్కడికి వెళ్లిన స్థానికులతో చెప్పినట్లు తెలుస్తోంది.

పాత కక్షలే ప్రధాన కారణం
ఇళ్లు, అపార్ట్‌మెంట్స్‌ కడుతూ సివిల్‌ కాంట్రాక్టర్‌గా బమ్మిడి విజయ్‌కిరణ్‌ పనిచేసేవాడు. తల్లి చనిపోవడంతో తండ్రి రమణతో కలిసి వి.జుత్తాడలో నివాసం ఉండేవాడు. విజయవాడలో ఉంటున్న తన మేనత్త రమాదేవి కుమార్తె ఉషారాణిని 2007లో వివాహం చేసుకున్నాడు. కుటుంబం విజయవాడలో ఉండగా.. పనుల నిమిత్తం జుత్తాడలో నివసించేవాడు. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన బత్తిన అప్పలరాజు కుమార్తె పార్వతితో పరిచయం పెంచుకోజూడటంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. గ్రామంలో పెద్దల మధ్య పంచాయతీ కూడా జరిగింది. ఈ క్రమంలో అప్పలరాజు తన కుమార్తె పార్వతితో విజయ్‌కిరణ్‌పై 2018లో పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించాడు.

పోలీసులు 245/2018 నంబర్‌తో ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేసి సెక్షన్‌ 376, 506(2) కింద అత్యాచారం, బెదిరింపు కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో తమని వేధిస్తున్నారంటూ విజయ్‌ కుటుంబ సభ్యులు కూడా అప్పలరాజు కుటుంబంతో పాటు ఆయన సోదరుల కుటుంబాలపైనా కేసు పెట్టారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అప్పలరాజు పగ పెంచుకొని.. అదునుచూసి విజయ్‌ కుటుంబాన్ని క్రూరంగా చంపేశాడు. వాస్తవానికి రాష్ట్రంలో 2019లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై లైంగిక వేధింపులను అత్యంత సీరియస్‌గా పరిగణించింది. ఇందులో భాగంగా దిశ చట్టాన్ని రూపొందించింది. దీంతో మహిళలపై లైంగిక వేధింపులు బాగా తగ్గాయి. ఈ క్రమంలో ప్రస్తుత ఘటన 2018లో జరిగిన గొడవ కారణంగా, పాత కక్షలను మనసులో పెట్టుకుని చోటుచేసుకున్నది కావడం గమనార్హం.
 



చదవండి: విశాఖలో ఎన్‌ఆర్‌ఐ కుటుంబం అనుమానాస్పద మృతి

చదవండి: ఎన్‌ఆర్‌ఐ కుటుంబం అనుమానాస్పద మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement