కావలి: బోగోలు మండలం కొండబిట్రగుంటలో ఒకే ఇంట్లో ముగ్గురిని దారుణంగా హత్య మార్చిన ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 5న కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాల నేపథ్యంలో సొంత కోడలితో పాటు ఆమె నాన్న, అమ్మమ్మను అత్త, మామ, మరిది కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన రోజు నుంచి నిందితులు పరారీలో ఉండగా పోలీసులు నిఘా ఉంచి శుక్రవారం అరెస్ట్ చేశారు. కావలి డీఎస్పీ వెంకట రమణ నిందితుల వివరాలను వెల్లడించారు. వివరాలు.. కొండబిట్రగుంటకు చెందిన మందాటి మధుసూదన్‌కు, బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన వాడకుప్ప మౌనికతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది.
వీరికి సుమారు ఎనిమిదేళ్ల వయస్సున బాబు ఉన్నాడు. రైల్వే ఉద్యోగిగా పనిచేసే మధుసూదన్ తరచూ మద్యం సేవించి భార్యతో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో భార్యభర్తలిద్దరూ నాలుగేళ్లుగా విడిగా ఉంటున్నారు. మౌనిక తన కుమారుడిని బుచ్చిలోని అమ్మమ్మ వద్ద ఉంచి తను బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గతనెల 28న భర్త గుండెపోటుతో చనిపోవడంతో మౌనిక కొండబిట్రగుంటలోని అత్తగారింటికి వచ్చింది.
ఆమెకు తోడుగా ఆమె నాన్న వాడకుప్ప కృష్ణయ్య, అమ్మమ్మ శాంతమ్మ కూడా వచ్చి కొండబిట్రగుంటలోనే ఉన్నారు. ఈ క్రమంలో ఆస్తి గొడవలు తలెత్తడంతో ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి సమయంలో మౌనిక అత్తమామలైన మందాటి మాల్యాద్రి, మందాటి ధనమ్మ, మరిది మౌళిచంద్రలు ఇనుప రాడ్లతో దాడి చేసి ముగ్గురిని హతమార్చారు. మౌనిక తల్లి వాడకుప్ప పద్మావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి బుడంగుంట గేటు వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment