జైపూర్: నూపుర్ శర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ అజ్మీర్ దర్గా ఖాదిం సల్మాన్ చిస్తీని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. నూపుర్ శర్మ తల తెచ్చిన వారికి తన ఇల్లుతో పాటు ఆస్తినంతా రాసిస్తానని సల్మాన్ ఓ వీడియో విడుదల చేశాడు. మహమ్మద్ ప్రవక్తను అవమానించిన ఆమెను హతమార్చాలని పిలుపునిచ్చాడు. తాను అజ్మేర్ దర్గా నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పాడు. వీలుంటే తానే ఆమెను తుపాకీతో కాల్చి చంపేవాడినని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
అంతేకాదు దేశంలోని ముస్లింలకు రక్షణ లేకుండా పోయిందని, అనేక చోట్ల తమపై దాడులు జరుగుతున్నాయని చెప్పాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో కాసేపట్లోనే వైరల్ అయింది. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సల్మాన్‌ను అరెస్టు చేశారు.
సల్మాన్ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని అజ్మీర్ దర్గా ప్రతినిధులు స్పష్టం చేశారు. దర్గా పవిత్ర స్థలం అని, అలాంటి చోట ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సల్మాన్ డ్రగ్స్‌కు బానిసయ్యాడని, అతనిపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
కాగా, నూపుర్ శర్మ వ్యాఖ్యలకు మద్దతు తెలిపినందుకు రాజస్థాన్ ఉదయ్‌పుర్‌లో కన్నయ్య లాల్ అనే టైలర్‌ను ఇద్దరు వ్యక్తులు ఇటీవలే దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అతడిని హత్య చేసిన అనంతరం వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. మహ్మద్ ప్రవక్తను అవమానించినందుకు ఈ ఘటనకు పాల్పడినట్టు చెప్పారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. పోలీసులు ఇద్దరు నిందితులను మూడు గంటల్లోనే అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment