పారిపోతున్నారు.. ఒకరి తర్వాత ఒకరుగా పారిపోతున్నారు. అవినీతి ఆనకొండ అరెస్ట్ కావడంతో.. అవినీతి పందికొక్కులన్నీ విదేశీ కలుగుల్లో దాక్కొంటున్నాయి. దర్యాప్తు అనగానే వణుకు పుడుతోంది. లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము స్వాహా చేశారు కాబట్టే.. ఎక్కడ దొరికిపోతామోనన్న భయంతో జంప్ అయిపోతున్నారు. ఒకవైపు చంద్రబాబు.. నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారని తెగ వాపోతున్నారు. మరోవైపు కుంభకోణాల్లో తనకు సహకరించిన వారందరినీ ఆయన సలహాతోనే దేశం దాటించేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సింపుల్‌గా చెప్పుకోవాలంటే.. దొరికి పోయామని అర్థమైంది. పరారైపోయారు..
చంద్రబాబు నాయుడు తన హయాంలో సాగించిన కుంభకోణాలు అన్నీ ఇన్నీ కావు. అందులో ప్రధాన సూత్రధారి చంద్ర బాబు అయితే.. కీలక పాత్రధారులు చాలా మందే ఉన్నారు. సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో టీడీపీ సర్కారు అవినీతి బాగోతాలు బయటపడుతున్న కొద్దీ.. పరారవుతున్న వారి జాబితా పెరుగుతూ వస్తోంది. తాజాగా లోకేష్‌కి అత్యంత సన్నిహితుడు కిలారు రాజేష్ పరారైన బ్యాచ్‌లో చేరిపోయాడు. జైల్లోకి వెళ్లక ముందు ఈ పరారీ ఎపిసోడ్‌కి దర్శకత్వం చంద్రబాబు వహించారని.. జైల్లోకి వెళ్లిన తర్వాత సలహాలు, సూచనలు ఇస్తూ చంద్రబాబు దర్శకత్వ పర్యవేక్షణ వహిస్తు న్నారని.. రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తనకే పాపం తెలియదని.. తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఒకవైపు గగ్గోలు పెడుతోన్న చంద్రబాబు.. మరోవైపు కుంభకోణాల్లో కీలకంగా వ్యవహరించిన వారిని దేశం దాటించేస్తున్నారు. వాళ్లు దొరికితే కీలక ఆధారాలన్నీ దొరికిపోయినట్టే అని చంద్రబాబు తెగ ఆందోళన చెందుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, అలానే.. షాపూర్జీ-పల్లోంజీ ప్రతినిధి మనోజ్ ఇద్దరూ ఇప్పటికే విదేశాలకు చెక్కేశారు. శ్రీనివాస్‌ని అమెరికాకి, మనోజ్‌ని దుబాయ్‌కి పంపించేసేది చంద్రబాబే అని పొలిటికల్ ఎనలిస్ట్‌లు విశ్లేషిస్తున్నారు. సెప్టెంబర్ నెల 5వ తేదీన సీఐడీ నుంచి నోటీసులు వస్తే.. ఆరవ తేదీన శ్రీనివాస్ అమెరికాకి వెళ్లిపోయాడు. చంద్రబాబు ఏ తప్పు చేయ నప్పుడు.. వాళ్లని ఎందుకు దేశం దాటించేశారన్న ప్రశ్న మొత్తం స్కామ్‌లకు సూత్రధారి చంద్రబాబే అని చెప్పకనే చెబుతోంది. మరోవైపు.. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఢిల్లీ పారిపోయిన లోకేష్.. అక్కడ నేషనల్ మీడియా ముందు అమాయకత్వం నటించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. ఒక నేషనల్ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ అమెరికాకి పిక్నిక్‌కి వెళ్లాడని లోకేష్‌కి చెప్పుకొచ్చాడు. మరి, తన బాస్‌ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే.. ఆఘమేఘాల మీద అమెరికా నుంచి రావాల్సిన పీఏ రాలేదు. ఇంకా అమెరికాలో పిక్నిక్‌ని ఎంజాయ్ చేస్తూనే ఉన్నా డు. ఎందుకంటే.. శ్రీనివాస్ అమెరికా వెళ్లింది. మనోష్ దుబాయ్ వెళ్లింది. విహారయాత్రకి కాదు. పరారైన యాత్రకు.
స్కామ్‌ల్లో సీఐడీ ఎవరెవరి పేర్లు అయితే బయటపెట్టిందో.. ఎవరెవరి పాత్రలపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టంగా చెబుతోందో.. వాళ్లంతా ఒకరి తర్వాత ఒకరుగా చంద్రబాబు అరెస్ట్‌కి ముందు పారిపోయారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పారి పోతున్నారు. నిర్దోషులు అయితే వాళ్లెందుకు పారిపోతున్నారు?. మరోవైపు ఢిల్లీలో వ్యవహరాలు చక్కపెట్టేందుకని లోకేష్ హడావుడి చేస్తున్నా.. అరెస్ట్ భయంతోనే ఆయన కూడా హస్తిన పారిపోయారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరో ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే.. చంద్రబాబుని అరెస్ట్ చేయగానే రోడ్డు మీద పడుకుని గగ్గోలు పెట్టేసిన పవన్ కళ్యాణ్.. ఇక టీడీపీతోనే కలిసి పనిచేస్తానని ముసుగు తీసేసిన దత్తపుత్రుడు.. ఆ తర్వాత ఎక్కడా కనిపించడం లేదు. పవన్ సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇక వన్.. టూ.. త్రీ.. అంటూ ఒకరి తర్వాత ఒకరుగా పరారైయ్యే వాళ్లు పరారైపోతున్నారు.
చంద్రబాబు ఎలాంటి తప్పు చేయకపోతే.. ఒకవైపు దర్యాప్తునకి పూర్తిగా సహకరిస్తూ, మరోవైపు సీఐడీ నోటీసులు ఇచ్చిన వారందరూ పారిపోకుండా చూసేవారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రకరకాల కుంభకోణాలతో ప్రజాధనాన్ని చంద్రబాబు స్వాహా చేశారు కాబట్టే.. సాక్ష్యాధారాలు బయటపడకుండా స్కామ్‌లో సహకరించిన అందరినీ దేశాలు దాటిస్తున్నారన్న సంగతి.. సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోతోంది. తాజాగా కిలారు రాజేష్ కూడా పారిపోవడంతో పరారైన వాళ్ల సంఖ్య ముగ్గురికి చేరింది. పారిపోయిన వాళ్లు ముగ్గురు కాదు. నలుగురు అంటూ లోకేష్ వైపు వేలు చూపించే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇంతకీ, కిలారు రాజేష్‌ని దేశం దాటించారా? లేక దేశంలోనే దాచేశారా? విదేశీ కలుగుల్లో దాక్కొన్న అవినీతి పందికొక్కులను పట్టే స్కెచ్.. సీఐడీ సిద్దం చేస్తోంది. ఇంతకీ.. అసలు లోకేష్ ఢిల్లీలో ఏం చేస్తున్నాడు.?
ఇది కూడా చదవండి: చంద్రబాబు విడుదల కాలేరు: రఘువీరారెడ్డి వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment