
సాక్షి, గుంటూరు: జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అప్పు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఓ తాపీ మేస్త్రి మహిళపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. వివరాలు... విజయవాడ రాణిగారి తోటలో నివసిస్తున్న గోవర్ధని అనే మహిళ, తాడేపల్లి మహానాడులోని తాపీ మేస్త్రి గోపికృష్ణకు మూడు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చింది. కొంతకాలంగా తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వమని అతడిని అడుగుతోంది. అయితే గోపీకృష్ణ మాత్రం ఆమె కంటపడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.
ఈ క్రమంలో గోపీకృష్ణ.. మంగళగిరి మండలం రామచంద్రపురం సమీపంలో ఉన్నాడని తెలుసుకున్న గోవర్ధని అక్కడికి చేరుకుని అతడి ఆటోకు తన బైకును అడ్డం పెట్టింది. డబ్బులు అడుగుతుంటే ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నావు అని నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆటోలో కూర్చున్న గోపికృష్ణ ఒక్కసారిగా ఇష్టారీతిన దూషిస్తూ.. గోవర్ధనిని కాలితో తన్నాడు. దీంతో ఆమె నాలుగడుగుల దూరంలో పడిపోయింది. 100కు ఫోన్ చేయడంతో పోలీసులు వెంటనే స్పందించారు. ఆమెను మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స చేయించారు. గోవర్ధని ఇచ్చిన ఫిర్యాదుతో గోపికృష్ణను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment