సాక్షి, గుంటూరు: ఉచిత ఇసుక విధానంతో రాష్ట్ర ఖజానాకు నష్టం కలగజేసిన సీఐడీ అభియోగాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారాయన. బుధవారం హైకోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ జరగగా.. ఈ నెల 22వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది హైకోర్టు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన ఇసుక దోపిడీపై సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే.. రాజకీయ కార్యకలాపాలకు తనను దూరంగా ఉంచాలని, న్యాయవిచారణ ప్రక్రియలో మునిగిపోయేలా చేయాలని, వేధించాలన్న ఏకైక ఉద్దేశంతో ఈ కేసు నమోదు చేశారని ముందస్తు బెయిల్ పిటిషన్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ నెల 20వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
ఇసుక కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఉచితంగా ఇసుకను ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 1,300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఐడీ ఆరోపించింది. ఇసుక పాలసీపై కేబినెట్ లో చర్చించలేదని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమా పేర్లను చేర్చింది. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది.
సీఐడీ తన అభియోగాల్లో.. ముఖ్యమంత్రి చంద్రబాబు కర్త, కర్మ, క్రియగా వ్యవహరించి ఇసుక కుంభకోణం సాగించారని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ చట్టం, గ్రీన్ ట్రిబ్యునల్ విధివిధానాలను ఉల్లంఘించి, కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ‘ప్రత్యేక మెమో’ ద్వారా చంద్రబాబు పన్నాగం పన్నారంటూ.. ఆధారాలతోసహా బయటపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment