రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో కానిస్టేబుల్‌పై హత్యాయత్నం
తీవ్రగాయాలు.. పరిస్థితి విషమం
ముస్తాబాద్ (సిరిసిల్ల): ఇసుక స్మగ్లర్ల ఆగడాలు జిల్లాలో పరాకాష్టకు చేరుకున్నాయి. పోలీసులు పట్టుకున్న ఇసుక ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించే క్రమంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై ఇసుక స్మగ్లర్ దాడి చేశాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో ప్రాణపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎస్సై శేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లె మానేరు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా అవుతోందన్న సమాచారంతో ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం రాత్రి తనిఖీలకు వెళ్లారు.
రాంరెడ్డిపల్లె, నామాపూర్ గ్రామాల మధ్య ఐదు ట్రాక్టర్లను పట్టుకున్నారు. వాటిని ఠాణాకు తరలిస్తుండగా, గోపాల్‌పల్లెకు చెందిన భూక్య గురుబాబు తన కారులో నామాపూర్ చేరుకున్నాడు. ‘నా బండినే పట్టుకుంటారా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రాక్టర్‌పై ఉన్న కానిస్టేబుల్ సత్యనారాయణపై దాడికి దిగాడు. దీంతో కానిస్టేబుల్ ఎదురుతిరిగి ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాల్సిందేనని పట్టుబట్టాడు. అక్కడికి చేరుకున్న ఎస్సై ట్రాక్టర్‌ను ఠాణాకు తీసుకెళ్లాలని హెచ్చరించాడు.
దీంతో గురుబాబు ట్రాక్టర్‌ను నడిపాడు. ఆ సమయంలో కానిస్టేబుల్ సత్యనారాయణ ట్రాక్టర్ ఇంజిన్‌పై కూర్చోగా, నామాపూర్ శివారులోని మేళ్ల చెరువు వద్దకు చేరుకోగానే గురుబాబు ట్రాక్టర్‌ను వేగంగా నడుపుతూ చెరువులోకి తీసుకెళ్లి.. తాను కిందకి దూకి పారిపోయాడు. ట్రాక్టర్‌పై ఉన్న కానిస్టేబుల్ చెరువులోని బండరాళ్లపై పడిపోగా నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్ చెరువు నీటిలో మునిగిపోయింది.
అటుగా వచ్చిన ఎస్సై వెంటనే కానిస్టేబుల్‌ను 108లో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గురుబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment