ఆపై ఎమ్మెల్యే ఇంట్లోకి ఎత్తుకెళ్లి విచక్షణారహితంగా దాడి
ఆళ్లగడ్డలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తల హత్యాయత్నం
ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో టీడీపీ కార్యకర్తలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. పట్టణ నడిబొడ్డున అందరూ చూస్తుండగా మోటార్ సైకిల్‌పై వెళ్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త చాకలి శ్రీనును జీపుతో ఢీకొట్టి.. ఆపై కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే అఖిల ప్రియ ఇంట్లో.. ఆమె సమక్షంలో తీవ్రంగా కొట్టి పట్టణ శివారులో పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. బాధితుల కథనం మేరకు.. ఆళ్లగడ్డకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత భూమా కిషోర్‌రెడ్డికి లింగందిన్నెకు చెందిన చాకలి శ్రీను అనుచరుడు.
శుక్రవారం ఆరోగ్యం సరిగాలేదని ఆళ్లగడ్డలోని మెడికల్ స్టోర్‌కు వచ్చి, మందులు తీసుకుని మరో యువకుడితో కలిసి బైక్‌పై లింగందిన్నెకు బయలుదేరాడు. వారిని వాహనంలో వెంబడిస్తూ వచ్చిన ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు బైక్‌ను ఢీకొట్టారు. దీంతో శ్రీను, మరో యువకుడు కిందపడ్డారు. వెంటనే కర్రలు, రాడ్లతో వాహనంలోంచి దిగిన టీడీపీ రౌడీ మూకలు శ్రీనును కొట్టుకుంటూ వాహనంలో వేసుకుని ఎమ్మెల్యే ఇంట్లోకి తీసుకెళ్లారు.
మరో యువకుడు పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని శ్రీనును కిడ్నాప్ చేసి ఎమ్మెల్యే ఇంట్లో బంధించారని పోలీసులకు చెప్పినా ఫలితం లేదు. తుదకు శ్రీనును చంపొద్దని బతిమాలడంతో స్పృహ కోల్పోయేలా కొట్టి పొలాల్లో పడేశారు. ఆపై పోలీసులు 108లో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
3 గంటలకు పైగా ఉత్కంఠ
శ్రీనును కిడ్నాప్ చేసి ఎమ్మెల్యే ఇంట్లో బంధించిన విషయం పట్టణంలో దావానలంలా వ్యాపించింది. టీవీ చానళ్లలో ప్రముఖంగా ప్రసారమైంది. అయినా పోలీసులు చలనం లేకుండాపోయింది. సుమారు 3 గంటలకు పైగా బాధితుడిని ఇంట్లో ఉంచి కొడుతున్నా.. అరుపులు బయటకు వినిపిస్తున్నా.. పోలీసులు మౌనం వహించారు. బాధిత కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే.. విడిచి పెట్టాలని కోరుతున్నామని చెప్పారే తప్ప కనీసం ఆ ఇంటి వద్దకు కూడా వెళ్లక పోవడం విమర్శలకు తావిస్తోంది.
విషయం వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని.. టీడీపీ శ్రేణులతో చర్చలు కొనసాగించినట్లు తెలుస్తోంది. కొట్టి పొలాల్లో పడేస్తామని వారు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో ముందుగానే పోలీసులు 108 వాహనాన్ని సిద్ధం చేసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడికి ఆళ్లగడ్డలో ప్రథమ చికిత్స కూడా చేయించకుండా 50 కి.మీ దూరంలోని నంద్యాల వైద్యశాలకు తరలించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment