రోజూ దాడులు చేసి కొడతాం..
వైఎస్సార్‌సీపీ వాళ్లు ఎవరడ్డొస్తారో రండి..
మంత్రి అనగాని ఇలాకాలో టీడీపీ స్వైరవిహారం
తాజాగా చెరుకుపల్లి మాజీ ఎంపీపీ అనుచరుడి ఇంటిపై దాడి
ఐదుగురికి గాయాలు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ‘ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలందరినీ చంపేస్తాం.. రోజు ఇళ్ల మీదకు వచ్చి కొడతాం. వైఎస్సార్‌సీపీ నా కొడుకులు ఎవడడ్డమొస్తాడో రమ్మను. ఒక్కొక్కరి అంతు చూస్తాం’ చెరుకుపల్లి మండలం గుళ్లపల్లిలో శనివారం తెలుగుదేశం కార్యకర్తల హెచ్చరిక ఇది. మంత్రి అనగాని ఇలాకా రేపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం వర్గీయులు రెచ్చిపోయి ప్రవర్తిస్తూనే ఉన్నారు. గుళ్లపల్లిలో శుక్ర, శనివారాల్లో చెరుకుపల్లి మాజీ ఎంపీపీ చెన్ను కోటేశ్వరరావు అనుచరుడైన రిటైర్డ్ ఆర్మీ జవాను సంపత్‌కుమార్ ఇంటిపై దాడిచేశారు.
ఇంటిని ధ్వంసం చేసి, సంపత్‌కుమార్‌తో సహా ఐదుగురిని గాయపరిచిన వారు.. రేపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ వారందరినీ చంపేస్తామంటూ బెదిరించారు. శుక్రవారం సాయంత్రం టీడీపీ కార్యకర్త కుమార్ మరికొందరు వైఎస్సార్‌సీపీ కార్యకర్త సంపత్‌కుమార్ ఇంటిపై దాడిచేశారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో రాళ్లతో ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. బూతులు తిట్టి వెళ్లిపోయారు. శనివారం 15 మందితో కలిసి కుమార్ మళ్లీ సంపత్‌కుమార్ ఇంటిపై దాడిచేశాడు.
ఒక్కసారిగా ఇంట్లోకిదూరి బూతులు తిడుతూ దొరికిన వారిని దొరికినట్లు కొట్టారు. ఇంట్లో సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ దాడిలో సంపత్‌కుమార్, ఆయన బాబాయి గాలి శ్రీనివాసరావు, తమ్ముడు గాలి శివకృష్ణ, మరో ఇద్దరు గాయపడ్డారు. గాలి శ్రీనివాసరావు దవడకు పెద్ద గాయమైంది. సంపత్‌కుమార్‌కు ఎదపైన, పొట్టమీద గాయాలయ్యాయి. గాయపడినవారిని స్థానికులు తెనాలి ఆస్పత్రికి తరలించారు. వారిని ఆస్పత్రికి తరలించిన తరువాత తెలుగుదేశం వర్గీయులు మరోసారి సంపత్‌కుమార్ ఇంటిపై దాడిచేశారు.
దాడులు, ఆస్తుల ధ్వంసం
బాధ్యతాయుతమైన మంత్రి అనగాని నియోజకవర్గంలో రెండు నెలలుగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై టీడీపీ వారు దాడులు చేస్తున్నారు. ఆస్తులను «ధ్వంసం చేస్తున్నారు. బలహీనవర్గాలపై ఈ తరహా దాడులు పెరిగాయి. ఊళ్లు విడిచి వెళ్లకపోతే చంపేస్తామని మైకు అనౌన్స్‌మెంట్ల ద్వారా హెచ్చరిస్తున్నారు. ఊరువదలి వెళ్లక పోతే చంపేస్తామని టీడీపీ మూకలు హెచ్చరించడంతో రెండునెలలు అజ్ఞాతంగా గడిపిన చెరుకుపల్లి మాజీ ఎంపీపీ చెన్ను కోటేశ్వరరావు నాలుగు రోజుల కిందట సొంత గ్రామం గుళ్లపల్లికి వచ్చారు.
ఆయన రాగానే తెలుగుదేశం వర్గీయులు ఆయన అనుచరులపై దాడులకు దిగారు. ఇటీవల తమ ఇంటివద్ద అరుగుపై కూర్చుని ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలు వాకా వెంకటేశ్వరరావు, వీరంకి శివయ్యలపై కర్రలతో దాడిచేసి కొట్టి గాయపరిచారు. కస్తూరివారిపేటలో ఆంధ్రప్రభ విలేకరి యనుముల వెంకటేశ్వరరావు ఇంటిని జేసీబీతో ధ్వంసం చేశారు. రాం»ొట్లవారిపాలేనికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు రాజేష్‌కుమార్ ఇంటిపై 30 మంది టీడీపీ కార్యకర్తలు దాడిచేసి కొట్టారు.
ఇదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత, సర్పంచ్, సర్పంచ్‌ల సంఘం నాయకుడు ప్రసాదరెడ్డిని గ్రామం వదలి పెట్టకపోతే చంపేస్తామని హెచ్చరించారు. దీంతో ప్రసాదరెడ్డి గ్రామం వదలిపెట్టి వెళ్లిపోయారు. నగరం, నిజాంపట్నం తదితర మండలాల్లోను ఈ తరహా దాడులు పెరిగాయి. టీడీపీ మూకల దాడులు తట్టుకోలేక నియోజకవర్గంలోని వందలాదిమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గ్రామాలు వదలిపెట్టి వెళ్లారు.
స్పందించని పోలీసులు
నియోజకవర్గంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నా పోలీసులు ఏ మాత్రం స్పందించడం లేదు. దాడుల గురించి తెలిసినా తెలియనట్లే వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం వర్గీయుల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చేరిన వారి వద్దకు వెళ్లి మొక్కుబడిగా కేసు నమోదు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment