బనశంకరి: ఏటీఎంలో జ్యోతి ఉదయ్ అనే బ్యాంకు ఉద్యోగినిపై కొడవలితో దాడి చేసిన కేసులో దోషిగా తేలిన కె.మధుకర్‌రెడ్డికి బెంగళూరులోని 65వ సిటీ సివిల్ కోర్టు శిక్ష ఖరారు చేసింది. 12 ఏళ్ల కారాగారవాసం విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. 2013 నవంబరు 19న ఉదయం 7.30 గంటల సమయంలో బెంగళూరు కార్పొరేషన్ సర్కిల్‌లోని కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో జ్యోతి ఉదయ్ డబ్బులు తీసుకుంటూ ఉండగా మధుకర్ కొడవలితో గాయపరిచి కొంత డబ్బు ఎత్తుకెళ్లాడు. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.(చదవండి: ‘నేను శివుణ్ణి.. కాళికను’: పద్మజ కేకలు)
ఈ ఘటనపై ఎస్‌జే పార్కు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తలకు తీవ్ర గాయాలపాలైన బాధితురాలు కొద్దినెలల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. పోలీసులు మూడేళ్ల పాటు గాలించినా నిందితుని ఆచూకీ లబించలేదు. 2017లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలో ఏటీఎంలో మహిళపై దాడి చేసిన కేసులో అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బెంగళూరు నేరాన్ని బయటపెట్టాడు. ఎస్‌జే పార్కు పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసకుని విచారణ చేపట్టి కోర్టులో చార్జిషీట్ సమర్పించారు. హత్యాయత్నం నేరం కింద 12 ఏళ్ల జైలు శిక్షను కోర్టు ఖరారు చేసింది.
ఆది నుంచి నేరచరిత్ర
చిత్తూరు జిల్లా మదనపల్లి తాలూకా దిగువపల్లి గ్రామానికి చెందిన మధుకర్‌రెడ్డికి నేర చరిత్ర ఉంది. మహబూబ్‌నగర్‌లో నారాయణ అనే ఉద్యోగిపై హత్యాయత్నం చేశాడు. అనంతపురం జిల్లా ధర్మవరంలో వృద్ధున్ని హత్య చేసి నగదు దోచుకున్నాడు. బెంగళూరులో మహిళపై దాడికి పాల్పడ్డాడు. సొంతూరులో నీటి విషయంలో ఆనందరెడ్డి అనే వ్యక్తిని హత్య చేసి 2005లో కడప సెంట్రల్ జైలుకెళ్లాడు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి 2011లో తప్పించుకుకెళ్లి నేరాలకు పాల్పడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment