సాక్షి, ప్రకాశం (టంగుటూరు): భరించలేని పని ఒత్తిడి ఓ వైపు.. ఆందోళన మరో వైపు వెరసి ఓ బ్యాంకు ఉద్యోగి బలవన్మరణానికి కారణమైంది. ఈ సంఘటన స్థానిక వాణి నగర్ మొదటి వీధిలో బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, ఉద్యోగులు కథనం ప్రకారం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాకు చెందిన ఐశ్వర్య నర్‌నత్ రణ్‌దేవ్ (24) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో బంధువులు పిన్ని, బాబాయి పెంచి పెద్ద చేశారు.
ఉన్నతంగా చదువుకున్న ఐశ్వర్య పట్టుదలతో రెండేళ్ల క్రితం బ్యాంక్ ఉద్యోగం సాధించింది. ఆరు నెలల క్రితం టంగుటూరి సిండికేట్ బ్యాంక్ శాఖలో ఫీల్డ్ ఆఫీసర్‌గా విధుల్లో చేరింది. అయితే చిన్న పనులకే ఒత్తిడి గురవుతుండేదని తోటి సిబ్బంది తెలిపారు. ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితం అధికారులకు రిజైన్ పత్రాలను అందించింది. కానీ ఉద్యోగం లేకపోతే ఏం చేయాలో తెలియక.. ఈ పని చేయలేక మానసికంగా కుంగిపోయింది. ఇటువంటి పరిస్థితుల మధ్య తాను నివసిస్తున్న బెడ్‌రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది.
బంధువులు ఫోన్ చేయడంతో..
ఐశ్వర్య పిన్ని, బాబాయ్‌లు రోజూ ఐశ్వర్యతో ఫోన్‌లో మాట్లాడుతుంటారు. అలాగే ఘటన జరిగిన రోజు ఉదయం 8 గంటలకు ఫొన్ చేయగా తీయలేదు. దీంతో బ్యాంక్ మేనేజర్ కాకర్ణ కృష్ణ ప్రసాద్‌కు ఫోన్ చేశారు. మేనేజర్ ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఉదయం 9: 30 గంటలకు అటెండర్‌ను ఆమె ఇంటికి పంపించారు. అతను ఇంటి యజమానితో కలిసి పైకి వెళ్లి చూడగా తలుపులు వేసి ఉన్నాయి. ఎంత పిలిచినా పలక్కపోవడంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా ఉరి వేసుకొని అప్పటికే మృతి చెందింది.
ఎస్సై ఖాదర్ బాషా, సిబ్బంది మృతదేహాన్ని పరిశీలించారు. యువతి కుడి చేతి మణికట్టుకు ఉన్న దారంలో ఉంచిన లెటర్, ప్యాంటు జేబులో సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తన మృతికి ఎవరూ కారణం కాదని.. పని ఒత్తిడి, చిన్న విషయాలకే భయం అని సూసైడ్ నోట్‌లో రాసి ఉంది. బ్యాంక్ మేనేజర్ కాకర్ణ కృష్ణ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment