
సాక్షి, తాడేపల్లిరూరల్: రహస్యంగా బయటకు తీసుకెళ్లిన స్నేహితురాలిని..తిరిగి హాస్టల్‌లో దిగబెట్టే సమయంలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ బీబీఏ విద్యార్థి మృత్యువాత పడిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సోమవారం మృతుడి తండ్రి తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది.
వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రకాశం జిల్లా కొండపి మండలం నేతివారిపాలెం గ్రామానికి చెందిన నేతి వినయ్‌కుమార్ (20), అతని స్నేహితుడు బండ్ల మనీశ్వర్‌చౌదరి కలిసి ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో.. అదే యూనివర్సిటీ విద్యార్థినుల హాస్టల్‌లో ఉంటున్న వారి స్నేహితులకు ఫోన్ చేసి బయటకు పిలిపించారు. అదే సమయంలో హాస్టల్‌లో ఉన్న తోటి విద్యార్థినులు బయటకొచ్చిన విద్యార్థినులకు ఫోన్ చేసి.. వాచ్‌మేన్ గమనిస్తున్నాడని.. వెంటనే వచ్చేయమని చెప్పారు. దీంతో వారు హాస్టల్ గోడ దూకి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
ఇద్దరు విద్యార్థినుల్లో ఓ విద్యార్థిని లోపలకు క్షేమంగా వెళ్లిపోయింది. మరో విద్యార్థిని మాత్రం గోడ ఎక్కలేక కిందకు జారి పడింది. ఇదే సమయంలో వాచ్‌మేన్ కేకలు వేయడంతో బయట ఉన్న విద్యార్థిని, ఆమె స్నేహితుడు నేతి వెంకట వినయకుమార్ కంగారుగా హాస్టల్ పక్కనే ఉన్న మరో భవనం పైకి పరుగులు తీశారు. ఆ భవనంలో ఉన్న వాచ్‌మేన్ కూడా వీరిని చూసి కేకలు వేయడంతో విద్యార్థిని మెట్లపైనే ఉండిపోయింది. వినయ్‌కుమార్ మాత్రం భవనం పైకి వెళ్లి, పైన రేకుల షెడ్ ఎక్కి అక్కడనుంచి ప్రమాదవశాత్తు కింద పడి ఘటనాస్థలంలోనే మృత్యువాత పడ్డాడు. వెంటనే హాస్టల్ నిర్వాహకులు వినయకుమార్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వినయకుమార్ స్నేహితుడైన మనీశ్వర్‌చౌదరి వినయకుమార్ తండ్రి రామకృష్ణకు సమాచారం అందజేయడంతో సోమవారం ఆయన తన కొడుకు మరణంపై అనుమానాలున్నాయంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఐదేళ్ల నుంచి ప్రేమ వ్యవహారం?
నేతి వెంకట వినయకుమార్, స్నేహితురాలి మధ్య గుంటూరులో ఇంటర్ మీడియట్ చదివే రోజుల నుంచే.. ఐదేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. యూనివర్సిటీలో చేరిన నాటినుంచి వీరిద్దరూ తరచుగా కలుసుకుంటున్నారని చెబుతున్నారు. ఇటీవల అదే క్లాసులోని మరో ఇద్దరు ప్రేమించుకోవడంతో రెండు జంటలు కలసి తరచుగా బయటకు వెళ్లి వస్తుంటారని, ఇది అందరికీ తెలిసిన విషయమేనని తోటి విద్యార్థులు పేర్కొంటున్నారు. కాగా, ప్రకాశం జిల్లా కొండపి మండలం నేతివారిపాలెంకు చెందిన వీఆర్వో రామకృష్ణ, ప్రశాంతి దంపతులకు నేతి వెంకట వినయకుమార్ ఏకైక కుమారుడు కావడంతో వారి ఆవేదనకు అంతులేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment