tadepalli police
-
పవన్, కారు డ్రైవర్‌పై కేసు నమోదు
సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి, విశాఖపట్నం/తాడేపల్లిరూరల్/కొమ్మాది (భీమిలి): జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్, ఆయన కారు డ్రైవర్‌పై తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 5వ తేదీన ఉదయం గుంటూరు జిల్లా తెనాలి మారీస్‌పేటకు చెందిన శివకుమార్ ఇప్పటం నుంచి బైక్‌పై బైపాస్ రోడ్‌కు వస్తున్నారు. అదే సమయంలో పవన్‌కళ్యాణ్ కారుపై కూర్చుని ఉండగా.. కొంతమంది ఆ కారుకు వేలాడుతూ ఇప్పటం వైపు దూసుకొచ్చారు. దీంతో శివకుమార్ కిందపడిపోయాడు. పవన్‌కళ్యాణ్, ఆయన డ్రైవర్ రాష్ డ్రైవింగ్ కారణంగా తనకు ప్రమాదం జరిగిందంటూ శుక్రవారం శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాడేపల్లి పోలీసులు ఐపీసీ 336, రెడ్ విత్ 171, 279/ఎంబీ కింద కేసు నమోదు చేశారు. రుషికొండ పనులను పరిశీలించిన పవన్: జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ తీర ప్రాంతంలో పర్యటించారు. ముందుగా రామానాయుడు స్టూడియో ఎదురుగా ఉన్న బీచ్‌లో నాదెండ్ల మనోహర్‌తో కలిసి కొద్దిసేపు విహరించారు. అక్కడకు వచ్చిన మత్స్యకారులతో మాట్లాడారు. అనంతరం రుషికొండలో గల కొండపై జరుగుతున్న పనులను పరిశీలించేందుకు వెళ్లారు. కొండ చుట్టూ బారికేడ్లు ఉండటంతో బయట నుంచే కొండపై జరుగుతున్న పనులను పరిశీలించారు. అయితే ఎవరికి సమాచారం లేకుండా పవన్ వెళ్లడం చర్చనీయాంశమైంది. పార్టీ ఇన్చార్జిలతో పవన్ భేటీ: జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ శనివారం పార్టీ ఇన్చార్జిలతో సమావేశమయ్యారు. విశాఖ నగరంలో తాను బస చేసిన హోటల్లో ఆయన వీరితో కాసేపు సమీక్షించారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన, తనతో భేటీ తదితర అంశాలను చర్చించారు. భవిష్యత్తు ప్రణాళికపై త్వరలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా, విజయనగరం శివారు గుంకలాంలోని వైఎస్సార్ జగనన్న కాలనీలోని ఇళ్లను ఆదివారం పవన్ పరిశీలించనున్నారు. -
పవన్ పై పోలీస్ కేసు నమోదు
-
ఆ బాడీ దొరికితేనే సంచలన కేసు కొలిక్కి: కృష్ణానదిలో గాలింపు ముమ్మరం
తాడేపల్లి రూరల్ (గుంటూరు జిల్లా): సంచలనం రేపిన సీతానగరం అత్యాచారం ఘటనకు ముందు హత్యకు గురైన ఆనంద్ మృతదేహం కోసం తాడేపల్లి పోలీసులు కృష్ణానదిలో అన్వేషణ ప్రారంభించారు. అత్యాచారంతో పాటు ఓ వ్యక్తిని హత్య చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారు. అత్యాచారానికి గురైన యువతి, ఆమె స్నేహితుడి సెల్ఫోన్లతో పాటు హత్యకు గురైన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి చెందిన ఆనంద్ సెల్‌ఫోన్ కూడా నిందితులు షేర్ కృష్ణ, షేక్ హబీబ్ వద్ద లభించాయి. జూన్ 22వ తేదీ ఆనంద్ భార్య మృదుల తన భర్త కనిపించడం లేదని, చివరిసారిగా కృష్ణానది రైల్వే బ్రిడ్జి మీద ఉంచి ఫోన్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై పోలీసులు జూన్ 23వ తేదీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో హత్యకు గురైంది మిస్సింగ్ కేసులో ఆనంద్ అని పోలీసులు నిర్ధారించారు. పోలీసులు మంగళవారం ఆనంద్ మృతదేహం కోసం కృష్ణా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. షేర్ కృష్ణ, ప్రసన్నరెడ్డి అలియాస్ వెంకటరెడ్డి, షేక్ హబీబ్ ముగ్గురూ కలిసి అత్యాచారం చేసేముందు దొంగతనం చేయడం, దానిని ఆనంద్ చూడటం, ఆనంద్ దగ్గర ఉన్న డబ్బులు లాక్కుని అతడ్ని కొట్టి, హత్యచేసి ఆ మృతదేహాన్ని ఓ ఐరన్ గిడ్డర్‌కు కట్టి కృష్ణానదిలో పడవేశారు. షేర్ కృష్ణ, హబీబ్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, విచారణలో మృతదేహాన్ని ఎక్కడ పడవేశాడో నిందితులు పోలీసులకు చూపించారు. దీంతో మృతదేహం కోసం పోలీసులు ఆ ప్రాంతంలో గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు నిర్వహించారు. ఆరుగురు గజ ఈతగాళ్లు ఐదు గంటల పాటు ఆనంద్ మృతదేహం కోసం విస్తృతంగా నీటిలో గాలించినా ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు. జూన్ 19వ తేదీ ఈ సంఘటన జరిగిన దగ్గర నుంచి కృష్ణా నదిలోకి రెండుసార్లు 5 లక్షల క్యూసెక్కులపైన వరద నీరు రావడం, ఆ నీటితో పాటు ఇసుక కూడా కొట్టుకువచ్చిందని, మృతదేహం ఎక్కడో ఇసుకలో కూరుకుపోయి ఉంటుందని గజ ఈతగాళ్లు చెబుతున్నారు. కృష్ణానదిలో పూర్తిగా నీళ్లు తగ్గితేనే కూరుకుపోయిన మృతదేహాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. వరద ఉధృతికి కొట్టుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయని గజ ఈతగాళ్లు పేర్కొన్నారు. పోలీసులు గజ ఈతగాళ్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో ఆనంద్ మృతదేహం కోసం గా>లించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
తాడేపల్లిలో ప్రేమికులపై దాడి కేసు : ఇద్దరు నిందితులను గుర్తించిన పోలీసులు
-
స్నేహితురాలిని రహస్యంగా తీసుకెళ్లి.. చివరకు ఇలా..
సాక్షి, తాడేపల్లిరూరల్: రహస్యంగా బయటకు తీసుకెళ్లిన స్నేహితురాలిని..తిరిగి హాస్టల్లో దిగబెట్టే సమయంలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ బీబీఏ విద్యార్థి మృత్యువాత పడిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సోమవారం మృతుడి తండ్రి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రకాశం జిల్లా కొండపి మండలం నేతివారిపాలెం గ్రామానికి చెందిన నేతి వినయ్‌కుమార్ (20), అతని స్నేహితుడు బండ్ల మనీశ్వర్‌చౌదరి కలిసి ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో.. అదే యూనివర్సిటీ విద్యార్థినుల హాస్టల్లో ఉంటున్న వారి స్నేహితులకు ఫోన్ చేసి బయటకు పిలిపించారు. అదే సమయంలో హాస్టల్లో ఉన్న తోటి విద్యార్థినులు బయటకొచ్చిన విద్యార్థినులకు ఫోన్ చేసి.. వాచ్‌మేన్ గమనిస్తున్నాడని.. వెంటనే వచ్చేయమని చెప్పారు. దీంతో వారు హాస్టల్ గోడ దూకి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇద్దరు విద్యార్థినుల్లో ఓ విద్యార్థిని లోపలకు క్షేమంగా వెళ్లిపోయింది. మరో విద్యార్థిని మాత్రం గోడ ఎక్కలేక కిందకు జారి పడింది. ఇదే సమయంలో వాచ్‌మేన్ కేకలు వేయడంతో బయట ఉన్న విద్యార్థిని, ఆమె స్నేహితుడు నేతి వెంకట వినయకుమార్ కంగారుగా హాస్టల్ పక్కనే ఉన్న మరో భవనం పైకి పరుగులు తీశారు. ఆ భవనంలో ఉన్న వాచ్‌మేన్ కూడా వీరిని చూసి కేకలు వేయడంతో విద్యార్థిని మెట్లపైనే ఉండిపోయింది. వినయ్‌కుమార్ మాత్రం భవనం పైకి వెళ్లి, పైన రేకుల షెడ్ ఎక్కి అక్కడనుంచి ప్రమాదవశాత్తు కింద పడి ఘటనాస్థలంలోనే మృత్యువాత పడ్డాడు. వెంటనే హాస్టల్ నిర్వాహకులు వినయకుమార్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వినయకుమార్ స్నేహితుడైన మనీశ్వర్‌చౌదరి వినయకుమార్ తండ్రి రామకృష్ణకు సమాచారం అందజేయడంతో సోమవారం ఆయన తన కొడుకు మరణంపై అనుమానాలున్నాయంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐదేళ్ల నుంచి ప్రేమ వ్యవహారం? నేతి వెంకట వినయకుమార్, స్నేహితురాలి మధ్య గుంటూరులో ఇంటర్ మీడియట్ చదివే రోజుల నుంచే.. ఐదేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. యూనివర్సిటీలో చేరిన నాటినుంచి వీరిద్దరూ తరచుగా కలుసుకుంటున్నారని చెబుతున్నారు. ఇటీవల అదే క్లాసులోని మరో ఇద్దరు ప్రేమించుకోవడంతో రెండు జంటలు కలసి తరచుగా బయటకు వెళ్లి వస్తుంటారని, ఇది అందరికీ తెలిసిన విషయమేనని తోటి విద్యార్థులు పేర్కొంటున్నారు. కాగా, ప్రకాశం జిల్లా కొండపి మండలం నేతివారిపాలెంకు చెందిన వీఆర్వో రామకృష్ణ, ప్రశాంతి దంపతులకు నేతి వెంకట వినయకుమార్ ఏకైక కుమారుడు కావడంతో వారి ఆవేదనకు అంతులేకుండా పోయింది. -
‘చావు’కొచ్చింది !
►ప్రకాశం బ్యారేజీ, కృష్ణాతీరంలో తేలుతున్న మృతదేహాలు ►బయటకు తీసింది మొదలు భద్రపరిచే వరకు ‘భారం’ ►గుర్తుతెలియని మృతదేహాలతో నానా ఇక్కట్లు.. ►జేబులు గుల్లవుతున్నాయని తాడేపల్లి పోలీసుల గగ్గోలు తాడేపల్లి రూరల్: మృతదేహం అంటేనే తాడేపల్లి పోలీసులు ఠారెత్తిపోతున్నారు. కృష్ణానదిలో తేలే ప్రతి మృతదేహాన్ని బయటకు తీసింది మొదలు పంచనామా, పోస్టుమార్టం, అనంతరం బంధువులు వచ్చేవరకు భద్రపరచడం ఇవన్నీ పోలీసులకు తలకు మించిన భారంగా పరిణమిస్తున్నాయి. వీటి కోసం శాఖా పరంగా ఎలాంటి నిధులు లేకపోవడంతో చేతి చమురు వదిలించుకుంటున్నారు. ఈ డ్యూటీ అంటేనే భయపడిపోతున్నారు. కృష్ణాతీరం, ప్రకాశం బ్యారేజి, కనకదుర్గ వారధి ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఆత్మహత్యలు, అనుమానాస్పద మృతులు పెరిగాయి. వీటికి తోడు రోడ్డు ప్రమాదంలో మృతులకు, ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయిన వారికి కూడా పోలీసులే పోస్టుమార్టం చేయించాల్సి వస్తోంది. ఏడాదిలో తాడేపల్లి పోలీసులు 70కి పైగా మృత దేహాలకు పంచనామా జరిపి, పోస్టుమార్టం చేయించాల్సి వచ్చింది. ఈ సమయంలో కానిస్టేబుళ్లు ఎదుర్కొంటున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా గుర్తుతెలియని మృతదేహాలతోనే వారు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. ►ఈ నెలలో ఇప్పటివరకు తాడేపల్లి పోలీసులు 18 మృతదేహాలకు పోస్టుమార్టం చేయించారు. పంచనామాలు, పోస్టుమార్టాలు రోజువారీ విధులకు ఆటంకం కలిగించడంతోపాటు కానిస్టేబుళ్ల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ►గుర్తు తెలియని మృతదేహాలతోనే పోలీసులు ఇబ్బందుల పాలవుతున్నారు.కుళ్లిన మృతదేహాలను నదిలో నుంచి బయటకు తీసే సమయంలో పోలీసుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ►దుర్వాసన తట్టుకోలేక ఆ మృతదేహాలను బయటకు తెచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఒకవేళ ఎవరైనా వచ్చినా ‘మందు’ పోయించకుండా పని జరగదు. దీని కోసం పోలీసులు తమ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ►కృష్ణా నది ఇసుక తిన్నెల్లో నుంచి మృతదేహాలను రోడ్డుపైకి తెచ్చి మార్చురీకి తరలించేందుకు ఏ వాహనదారుడు ముందుకు రావడం లేదు. పోలీసులు బెదిరించి తీసుకు వచ్చినా, నాలుగొందలో ఐదు వందలో వదిలించుకోవాల్సి వస్తోంది. ►ఇక మృతదేహం ఉందని తెలియగానే కేసు దర్యాప్తునకు వచ్చే అధికారులకు మర్యాద చేయడం కూడా పోలీసులకు అదనపు భారంగా మారింది. ►ఇలా అన్నీ పూర్తి చేసి ఒక్కో మృతదేహాన్ని మార్చురీకి తరలించాలంటే సుమారు రెండు వేల రూపాయల వరకు ఖర్చవుతోంది. వీటి కోసం నిధులు ఏమీ లేకపోవడంతో ఈ భారం కానిస్టేబుళ్లపైనే పడుతోంది. ►గుర్తు తెలియని మృతదేహాలను భద్రపరచడం పోలీసులకు తలకు మించిన పని అవుతోంది. ►కృష్ణానదిలో ఆత్మహత్య చేసుకునేవారు ఎక్కువగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఉంటున్నారు. కుటుంబీకులు, బంధువుల కోసం ఇలాంటి మృతదేహాలను ఎక్కువ రోజులు భద్రపరచాల్సి వస్తోంది. దీని కోసం ఏసీ మార్చురీ రూములు అవసరం అలాంటి సౌకర్యాలు ఏమీ లేవు. ►తాడేపల్లి పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాలను మంగళగిరి పంపిస్తుంటారు. అక్కడ పోస్టుమార్టం గదిలో తలుపులు ఊడిపోయి, కిటికీలకు చెక్కలు ఊలిపోయి, ఎలుకలు, పందికొక్కులే కాక, నక్కలు, కుక్కలు యథేచ్ఛగా మృతదేహాలను భక్షించేందుకు అనువుగా ఉంటుంది. పోనీ, దగ్గరలో ఉన్న విజయవాడ ప్రభుత్వాసుపత్రి మార్చురీకి పంపిద్దామంటే ‘సరిహద్దు’ సమస్య. ►ఇక మిగిలింది గుంటూరు ప్రభుత్వాసుపత్రే. అక్కడకు పంపించాలంటే మరో మూడు వేలు అదనపు ఖర్చు అవుతుంది. దీంతో మృతదేహాల తరలింపు డ్యూటీలంటే నే పోలీసులు భయపడిపోతున్నారు. -
స్నేహితుణ్ణి నదిలో తోసేశారు!
-
స్నేహితుడిని కృష్ణానదిలోకి తోసేశారు
గుంటూరు : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో దారుణం జరిగింది. ఇద్దరు యువకులు....స్నేహితుడిని దారుణంగా హతమార్చిన ఘటన గురువారం స్థానికంగా కలకలం సృష్టించింది. స్నేహితుడిని ప్రకాశం బ్యారేజీ పైనుంచి తోసేశారు. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఇద్దరు యువకులను పట్టుకునేందుకు ప్రయత్నించగా.... వారు కూడా బ్యారేజ్ పైనుంచి దూకేశారు. అయినా స్థానికులు వారిని వెంటాడి పట్టుకుని తాడేపల్లి పోలీసులకు అప్పగించారు. మృతుడితో పాటు, ఇద్దరు యువకులు విజయవాడకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. పక్కా పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్లు సమాచారం. నిందితులను విజయవాడ పోలీసులకు అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.