►ప్రకాశం బ్యారేజీ, కృష్ణాతీరంలో తేలుతున్న మృతదేహాలు
►బయటకు తీసింది మొదలు భద్రపరిచే వరకు ‘భారం’
►గుర్తుతెలియని మృతదేహాలతో నానా ఇక్కట్లు..
►జేబులు గుల్లవుతున్నాయని తాడేపల్లి పోలీసుల గగ్గోలు
తాడేపల్లి రూరల్: మృతదేహం అంటేనే తాడేపల్లి పోలీసులు ఠారెత్తిపోతున్నారు. కృష్ణానదిలో తేలే ప్రతి మృతదేహాన్ని బయటకు తీసింది మొదలు పంచనామా, పోస్టుమార్టం, అనంతరం బంధువులు వచ్చేవరకు భద్రపరచడం ఇవన్నీ పోలీసులకు తలకు మించిన భారంగా పరిణమిస్తున్నాయి. వీటి కోసం శాఖా పరంగా ఎలాంటి నిధులు లేకపోవడంతో చేతి చమురు వదిలించుకుంటున్నారు. ఈ డ్యూటీ అంటేనే భయపడిపోతున్నారు. కృష్ణాతీరం, ప్రకాశం బ్యారేజి, కనకదుర్గ వారధి ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఆత్మహత్యలు, అనుమానాస్పద మృతులు పెరిగాయి.
వీటికి తోడు రోడ్డు ప్రమాదంలో మృతులకు, ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయిన వారికి కూడా పోలీసులే పోస్టుమార్టం చేయించాల్సి వస్తోంది. ఏడాదిలో తాడేపల్లి పోలీసులు 70కి పైగా మృత దేహాలకు పంచనామా జరిపి, పోస్టుమార్టం చేయించాల్సి వచ్చింది. ఈ సమయంలో కానిస్టేబుళ్లు ఎదుర్కొంటున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా గుర్తుతెలియని మృతదేహాలతోనే వారు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు.
►ఈ నెలలో ఇప్పటివరకు తాడేపల్లి పోలీసులు 18 మృతదేహాలకు పోస్టుమార్టం చేయించారు. పంచనామాలు, పోస్టుమార్టాలు రోజువారీ విధులకు ఆటంకం కలిగించడంతోపాటు కానిస్టేబుళ్ల జేబులకు చిల్లు పెడుతున్నాయి.
►గుర్తు తెలియని మృతదేహాలతోనే పోలీసులు ఇబ్బందుల పాలవుతున్నారు.కుళ్లిన మృతదేహాలను నదిలో నుంచి బయటకు తీసే సమయంలో పోలీసుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు.
►దుర్వాసన తట్టుకోలేక ఆ మృతదేహాలను బయటకు తెచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఒకవేళ ఎవరైనా వచ్చినా ‘మందు’ పోయించకుండా పని జరగదు. దీని కోసం పోలీసులు తమ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.
►కృష్ణా నది ఇసుక తిన్నెల్లో నుంచి మృతదేహాలను రోడ్డుపైకి తెచ్చి మార్చురీకి తరలించేందుకు ఏ వాహనదారుడు ముందుకు రావడం లేదు. పోలీసులు బెదిరించి తీసుకు వచ్చినా, నాలుగొందలో ఐదు వందలో వదిలించుకోవాల్సి వస్తోంది.
►ఇక మృతదేహం ఉందని తెలియగానే కేసు దర్యాప్తునకు వచ్చే అధికారులకు మర్యాద చేయడం కూడా పోలీసులకు అదనపు భారంగా మారింది.
►ఇలా అన్నీ పూర్తి చేసి ఒక్కో మృతదేహాన్ని మార్చురీకి తరలించాలంటే సుమారు రెండు వేల రూపాయల వరకు ఖర్చవుతోంది. వీటి కోసం నిధులు ఏమీ లేకపోవడంతో ఈ భారం కానిస్టేబుళ్లపైనే పడుతోంది.
►గుర్తు తెలియని మృతదేహాలను భద్రపరచడం పోలీసులకు తలకు మించిన పని అవుతోంది.
►కృష్ణానదిలో ఆత్మహత్య చేసుకునేవారు ఎక్కువగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఉంటున్నారు. కుటుంబీకులు, బంధువుల కోసం ఇలాంటి మృతదేహాలను ఎక్కువ రోజులు భద్రపరచాల్సి వస్తోంది. దీని కోసం ఏసీ మార్చురీ రూములు అవసరం అలాంటి సౌకర్యాలు ఏమీ లేవు.
►తాడేపల్లి పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాలను మంగళగిరి పంపిస్తుంటారు. అక్కడ పోస్టుమార్టం గదిలో తలుపులు ఊడిపోయి, కిటికీలకు చెక్కలు ఊలిపోయి, ఎలుకలు, పందికొక్కులే కాక, నక్కలు, కుక్కలు యథేచ్ఛగా మృతదేహాలను భక్షించేందుకు అనువుగా ఉంటుంది. పోనీ, దగ్గరలో ఉన్న విజయవాడ ప్రభుత్వాసుపత్రి మార్చురీకి పంపిద్దామంటే ‘సరిహద్దు’ సమస్య.
►ఇక మిగిలింది గుంటూరు ప్రభుత్వాసుపత్రే. అక్కడకు పంపించాలంటే మరో మూడు వేలు అదనపు ఖర్చు అవుతుంది. దీంతో మృతదేహాల తరలింపు డ్యూటీలంటే నే పోలీసులు భయపడిపోతున్నారు.
‘చావు’కొచ్చింది !
Published Sun, Aug 24 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 PM
Advertisement
Advertisement