పదేళ్ల బాలికపై పూజారి అఘాయిత్యం | Bengaluru Priest Arrested For Molestated Minor Girl | Sakshi
Sakshi News home page

బాలికపై పూజారి అఘాయిత్యం

Published Thu, Nov 26 2020 5:45 PM | Last Updated on Thu, Nov 26 2020 6:28 PM

Bengaluru Priest Arrested For Molestated Minor Girl - Sakshi

బెంగళూరు: మతాధికారులు, పూజారులు, గురువులు, బాబాలకు మన సమాజంలో ఎంతో ఉన్నత స్థానం ఉంటుంది. ప్రజలు వీరిని దైవానికి ప్రతి రూపంగా భావిస్తారు. ఎంతో గౌరవమర్యాదలు ఇస్తారు. కానీ వారిలో కొందరు గురవింద గింజలు ఉంటారు. వెలుగులో ఎన్నో నీతులు బోధిస్తూ.. చీకట్లో దారుణాలకు పాల్పడతారు. వీరిలో కొందరు తమని నమ్మి.. శరణు కోరి వచ్చే ఆడవారి పట్ల దారుణాలకు పాల్పడే మృగాళ్లు కూడా ఉంటారు. దైవం పేరు చెప్పి దారుణాలకు పాల్పడే ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష విధించినా పాపం లేదు. తాజాగా ఈ మృగాళ్ల జాబితాలోకి ఓ బెంగళూరు పూజారి చేరాడు. దేవాలయం ప్రాంగణంలో ఉంటూ.. ఆలయ బాగోగులు పర్యవేక్షిస్తున్న పూజారి.. పదేళ్ల బాలికపై రాక్షసకాండ కొనసాగించాడు. స్వీట్స్‌ ఇస్తానంటూ చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 

వివరాలు.. చిక్‌బళ్లాపుర్‌కి చెందిన వెంకటరమణప్ప(68) పూజారిగా పని చేస్తుండేవాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం కుమార్తె ఇంటికి వచ్చాడు. అల్లుడు పనిమీద వేరే ఊరికి వెళ్లడంతో అతడికి బదులుగా ఆలయ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం సమయంలో ఆలయం బయట ఆడుకుంటున్న పదేళ్ల చిన్నారి వెంకటరమణప్ప కంట పడింది. బాలికను చూడగానే అతడి మనసులోకి ఓ దుష్ట ఆలోచన వచ్చింది. దాంతో చిన్నారి దగ్గరకు వెళ్లి తనతో పాటు వస్తే స్వీట్లు ఇస్తానంటూ ఆశపెట్టి ఆలయ ప్రాంగణంలో ఉన్న తన కూతురింటికి తీసుకెళ్లి.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆడుకోవడానికి బయటకు వెళ్లిన పాప ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు ఆ ప్రాంతంలో వెతకడం ప్రారంభించారు. పాప గురించి వాకబు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఆలయం బయట పూలు అమ్ముకునే వ్యక్తి బాలిక, పూజారితో పాటు వారింటికి వెళ్లడం చూశానని  తల్లిదండ్రులకు చెప్పాడు. అక్కడికి వెళ్లి చూడగా భయంతో గుక్కపట్టి ఏడుస్తున్న బిడ్డ వారికి కనిపించింది. (చదవండి: కామాంధులపై పాక్‌ సర్కారు ఉక్కుపాదం!)

ఏం జరిగిందని తల్లి అడగ్గా చిన్నారి దారుణాన్ని వివరించింది. వెంటనే వారు పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్‌ సీ కే బాబా మాట్లాడుతూ.. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. దర్యాప్తులో భాగంగా ఆలయం చుట్టు పక్కల ఉన్న సీసీటీవీ కెమరాలను పరిశీలించాము. బాలిక పూజారితో పాటు వెళ్లిన దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. అలానే పూలకొట్టు అతడి స్టేట్‌మెంట్‌ ఆధారంగా నిందితుడు వెంకటరమణప్పపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం’ అని తెలిపారు. కాగా, చిన్నారిపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని సోషల్‌ మీడియా వేదికగా ప్రజలు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement