
కంటోన్మెంట్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, ఆయన సోదరుల కిడ్నాప్ కేసులో హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి పోలీసులు తాజాగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో కీలక నిందితులైన ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్, సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి, మరో 14 మంది నిందితులు షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్న సంగతి తెలిసిందే.
అయితే కేసులో మరో కీలక నిందితుడు గుంటూరు శ్రీను ఆచూకీ ఇప్పటివరకు పోలీసులకు దొరకలేదు. ఈ క్రమంలో గుంటూరు శ్రీను సమీప బంధువు చైతన్యను రెండు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను, మరొకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. ఇందులో ఒకరైన పునీత్ అనే వ్యక్తి ఏపీ మాజీ మంత్రికి సమీప బంధువు అని సమాచారం.