
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కడప అర్బన్: మేడపై సరదాగా ఆడుకుంటున్న ఓ బాలుడిని విద్యుత్ తీగలు పొట్టన పెట్టుకున్నాయి. తల్లిదండ్రులకు తీరని గర్భశోకాన్ని మిగిల్చాయి. ఈ హృదయ విదారక సంఘటన కడప పట్టణంలో చోటు చేసుకుంది. కొద్ది సేపటి క్రితం వరకు ఆడుకుంటున్న కన్న బిడ్డ విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఏడేళ్లకే నూరేళ్లు నిండాయా బిడ్డా అంటూ బోరున విలపించారు. వివరాల్లోకి వెళితే.. కడప తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలోని భగత్‌సింగ్‌నగర్‌లో ఆదివారం సాయంత్రం షేక్ మహమ్మద్ ఉమర్(7) అనే బాలుడు విద్యాదాఘాతంతో మృతి చెందాడు. బాబా ఫకృద్దీన్, ఆయేషాలకు కుమార్తె షేక్ తస్లీం(9), కుమారుడు షేక్ మహమ్మద్ ఉమర్(7) సంతానం.
బాబా ఫకృద్దీన్ కార్పెంటర్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం మహమ్మద్ ఉమర్, మరో బాలుడు ఇంటి మొదటి అంతస్తు పైకి ఆడుకునేందుకు వెళ్లారు. ఈక్రమంలో విద్యుత్ తీగలు తగిలాయి. షాక్‌కు గురికావడంతో మహమ్మద్ ఉమర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని కడప తాలూకా సీఐ ఎం. నాగభూషణం తెలిపారు. బాలుడి మృతదేహాన్ని 45వ డివిజన్ కార్పొరేటర్ బత్తిన అంకమ్మ, డివిజన్ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ బత్తిన శ్రీనివాసులరెడ్డి పరిశీలించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.