సాక్షి, మిర్యాలగూడ: నాగార్జున సాగర్ ఎడమకాల్వలోకి గుర్తు తెలియని వ్యక్తులు కారును తోసేసి పరారైన ఘటనలో.. మిస్టరీ దాదాపుగా వీడింది. కారును కాలువలోకి తోసేసింది అన్నాచెల్లెళ్లుగా గుర్తించారు పోలీసులు. కుటుంబ విభేధాలతో పాటు మతిస్థిమితం సరిగా లేనందునే వాళ్లు ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తిప్పర్తికి చెందిన రామాంజనేయులు రిటైర్డ్ హెచ్ఎమ్. ఆయనకు మల్లికార్జున్, విఘ్నేశ్వరీ ఇద్దరు పిల్లలు. ఇద్దరు కూడా దివ్యాంగులే. గత కొంతకాలంగా తండ్రితో వాళ్లకు విభేదాలు నడుస్తున్నాయి. తల్లిదండ్రులతో దూరంగా మిర్యాలగూడ సమీపంలోని అవంతిపురంలో ఉంటున్నారు ఆ అన్నాచెల్లెళ్లు. తమను పట్టించుకోవడం లేదంటూ కొంతకాలం క్రితం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో తండ్రి రామాంజనేయులుపై ఫిర్యాదు కూడా చేసింది విఘ్నేశ్వరీ. ఈ క్రమంలో..
హైదరాబాద్ నాగోలులో ఓ కారును కొనుగోలు చేశారు ఆ అన్నాచెల్లెళ్లు. ఆపై ఆత్మహత్య చేసుకునేందుకే వాళ్లు సాగర్ ఎడమకాల్వలోకి కారును తోసేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ నిమిత్తం మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. అయితే మిర్యాలగూడ లో పార్కింగ్ చేసిన సమయంలో తమ కారు పోయిందని విఘ్నేశ్వరీ పొంతనలేని సమాధానాలు చెప్తోంది. దీంతో తల్లిదండ్రులతో మాట్లాడి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు పోలీసులు.
వీడియో ద్వారా..
నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రం శివారులో హోలీ పండుగ సందర్భంగా.. కొందరు యువకులు కాల్వలో ఈత కొడుతున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని యువకుడితోపాటు, ఓ మహిళ కారులో వచ్చారు. సాగర్ ఎడమ కాల్వ కట్టపైన వారు కారు నిలిపారు. అనంతరం కారును కాల్వలోకి తోసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సమీపంలో కాల్వలో ఈత కొడుతున్న యువకుడు సుధాకర్ అక్కడికి చేరుకుని నీటిలో కారు కొట్టుకుపోతుండగా తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కారు నీటిలో కొంతదూరం కొట్టుకుపోయి పూర్తిగా మునిగింది. అయితే అందులో ఎవరూ లేరని పోలీసులకు ఆ యువకుడు చెప్తున్నాడు. పోలీసులు కారు ఆచూకీ కోసం కాల్వ వెంట గాలింపు చర్యలు చేపట్టారు. కారు వెనుక డిక్కీలో ఏమైనా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment