హైదరాబాద్, సాక్షి: రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలు అయ్యాయి. దీంతో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజ్‌మెంట్‌ను నిందితులుగా చేర్చారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో ఫంక్షన్ల నిర్వహణ కోసం పలు గార్డెన్లను ఏర్పాటు చేశారు. అందులో ఒకటి లైమ్లైట్ గార్డెన్. ఈ గార్డెన్ వద్ద విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్‌ను నిర్వహిస్తున్నారు. అదే సమయంలో క్రేన్ ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్ ద్వారా గెస్టులను కిందకు దించుతుండగా వైర్ తెగిపోయింది. దీంతో పలువురు కంపెనీ ప్రతినిధులు కిందపడిపోయారు. తీవ్రగాయాలతో విస్టెక్స్ కంపెనీ సీఈవో సంజయ్ షా అక్కడికక్కడే చనిపోయాడు. మృతిని పోలీసులు ధృవీకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
ఈ ప్రమాదంలో కంపెనీ చైర్మన్ విశ్వనాథరాజుకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆయన్ని మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై ఆస్పత్రి నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరికొందరు కంపెనీ ప్రతినిధులకు సైతం గాయాలైనట్లు తెలిసింది.
ప్రమాదం ఎలా జరిగిందంటే.?
రామోజీ ఫిల్మ్ సిటీలోని లైమ్‌లైట్ గార్డెన్‌లో విస్టెక్స్ కంపెనీకి సంబంధించి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విస్టెక్స్ కంపెనీ సిబ్బంది పలువురు హాజరయ్యారు. ఏర్పాట్లు అన్నీ రామోజీ ఫిలింసిటీ చేసింది. ఇందులో భాగంగా సినిమా తరహాలో ఎత్తు నుంచి ఓ క్రేన్‌లో CEOను, ఛైర్మన్‌ను కిందికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇలాంటి సర్కస్ తరహా ఫీట్లకు నిర్వహాకులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిపుణులైన సిబ్బందితో పాటు.. నాణ్యమైన క్రేన్‌లు ఉండాలి. దీంతో పాటు పబ్లిక్ ఈవెంట్లలో ఇష్టానుసారంగా సర్కస్ ఫీట్లు చేయడానికి నిబంధనలు ఒప్పుకోవు. పైగా ఏ ప్రభుత్వాధికారి కూడా ఇలాంటి ఫీట్లకు అనుమతి కూడా ఇవ్వరు. అయినా రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహాకులు అన్ని నిబంధనలను పక్కనబెట్టి.. విస్టెక్స్ కంపెనీ ఉన్నతాధికారులను క్రేన్ ఎక్కించారు. తేడా కొట్టడంతో క్రేన్ కుప్పకూలి సీఈవో సంజయ్‌షా మరణించారు.
(ప్రమాదం జరిగిన గార్డెన్ ప్రాంతం ఇదే)
ఇక ఈ ఘటనపై కేసు నమోదు అయ్యింది. FIR ప్రకారం.. జానకీరాం రాజు అనే ప్రైవేట్ ఉద్యోగి ఈ ప్రమాద ఘటనపై ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులుగా రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజ్‌మెంట్‌ను చేర్చి దర్యాప్తు చేపట్టారు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు.
Comments
Please login to add a commentAdd a comment