టీడీపీ మాజీ ఎంపీ.. రాయపాటిపై సీబీఐ దాడులు | CBI Raids On Rayapati Sambasiva Rao | Sakshi
Sakshi News home page

టీడీపీ మాజీ ఎంపీ.. రాయపాటిపై సీబీఐ దాడులు

Published Sat, Dec 19 2020 3:57 AM | Last Updated on Sat, Dec 19 2020 4:02 AM

CBI Raids On Rayapati Sambasiva Rao - Sakshi

గుంటూరులోని రాయపాటి సాంబశివరావు నివాసం

సాక్షి, హైదరాబాద్‌ /పట్నంబజార్‌/నగరంపాలెం: (గుంటూరు):  తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ ఆకస్మిక దాడులు చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు శుక్రవారం ఉదయం హైదరాబాద్, గుంటూరులోని ఆయన నివాసం, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. గుంటూరు నగరం లక్ష్మీపురంలో ఉన్న ఆయన నివాసంలో ఉ.8 నుంచి మ.2.30 గంటల వరకు ఇవి కొనసాగాయి. ఈ సమయంలో రాయపాటి ఇంట్లోనే ఉన్నారు. పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్‌ డిస్క్‌లు, పన్నుల ఎగవేతకు సంబంధించిన నోటీసులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మొత్తం తొమ్మిది మంది అధికార బృందం ఈ సోదాల్లో పాల్గొనగా అందులో ఐదుగురు సీబీఐ అధికారులు కాగా, నలుగురు కెనరా బ్యాంకు అధికారులున్నట్లు తెలిసింది. రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ రూ.7,926.01 కోట్లు మోసానికి సంబంధించి పాల్పడిందని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. 

అసలేం  జరిగిందంటే..?
తాము చేపట్టబోయే పలు ప్రాజెక్టులకు రుణాలు కావాలని ట్రాన్స్‌టాయ్‌ కంపెనీ పలు బ్యాంకులను సంప్రదించింది. కెనరా బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం ఈ రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఇందుకు కెనరా బ్యాంకు నేతృత్వం వహించింది. అనంతరం.. వీరి నుంచి తీసుకున్న నిధులను తప్పుడు పత్రాలు, నకిలీ బ్యాలెన్స్‌ షీట్లు, మోసపూరిత స్టేట్‌మెంట్లు, తప్పుడు లెక్కల పుస్తకాలు, పత్రాలు చూపించి బ్యాంకు నిధులను తప్పుడు మార్గంలో మళ్లించారని.. ఫలితంగా తమకు రూ.7,926.01 కోట్లు నష్టం వాటిల్లినట్లు కెనరా బ్యాంకు సీబీఐకి ఫిర్యాదు చేసింది.

గతేడాది కూడా ఓ కేసు
అలాగే.. వివిధ క్రెడిట్‌ లిమిట్స్‌ నుంచి రూ.264 కోట్లను పలు దఫాల్లో వేరే ఖాతాలకు ట్రాన్స్‌టాయ్‌ మళ్లించిందని బ్యాంకులు ఆరోపిస్తున్నాయి. తమ వద్ద తీసుకున్న రుణాన్ని ఉద్దేశపూర్వకంగా వేరే ఖాతాలకు మళ్లించారంటూ హైదరాబాద్‌లోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫిర్యాదు మేరకు సీబీఐ 2019 డిసెంబరు 30న కేసు నమోదు చేసింది. అందులో చెరుకూరి శ్రీధర్, రాయపాటి సాంబశివరావు, ఇదే కంపెనీకి చెందిన ఇండిపెండెంట్‌ నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ సూర్యదేవర శ్రీనివాస బాబ్జి, గుర్తుతెలియని యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఉద్యోగులనూ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. 

నిందితులు వీరే..
ఈ కేసుతో సంబంధమున్న ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీకి చెందిన కార్యాలయాలు, పలువురు డైరెక్టర్ల ఇళ్లలోనూ ఈ సోదాలు జరిగాయి. ఈ కేసులో ఏ1గా ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా లిమిటెడ్‌ను సీబీఐ పేర్కొంది. ట్రాన్స్‌ట్రాయ్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చెరుకూరి శ్రీధర్, అడిషనల్‌ డైరెక్టర్‌ రాయపాటి సాంబశివరావు, అడిషనల్‌ డైరెక్టర్‌ అక్కినేని సతీష్, గుర్తుతెలియని ప్రభుత్వోద్యోగులను కూడా సీబీఐ నిందితులుగా చూపించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement