చలానా మాఫియా.. | Chalana Mafia In prakasam District | Sakshi
Sakshi News home page

చలానా మాఫియా..

Published Fri, Sep 10 2021 8:54 AM | Last Updated on Fri, Sep 10 2021 8:58 AM

Chalana Mafia In prakasam District - Sakshi

జిల్లా రిజిస్ట్రేషన్‌ శాఖను నకిలీ చలానాల కుంభకోణం కుదిపేస్తోంది. ఈ నెల 3వ తేదీ ఒంగోలు రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో వెలుగుచూసిన నకిలీ చలానాల బాగోతాన్ని మరవకముందే కందుకూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మరో మోసం బయటపడింది. జిల్లావ్యాప్తంగా డాక్యుమెంట్‌ రైటర్లతో పాటు అధికారులు, సిబ్బంది తీరుపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నకిలీ చలానాల స్కాంతో మరిన్ని అవకతవకలు చోటుచేసుకుని ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

ఒంగోలు సబర్బన్‌: స్టాంప్‌ డ్యూటీ కింద ప్రభుత్వానికి చెల్లించాల్సిన కేవలం 550 రూపాయలకు నకిలీ చలానా సృష్టించిన విషయం కందుకూరు సబ్‌ రిజి్రస్టార్‌ కార్యాలయంలో గురువారం వెలుగుచూసింది. అయితే, కందుకూరు సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయంలో చేయించాల్సిన రిజిస్ట్రేషన్‌కు ఎనీ వేర్‌ రిజిస్ట్రేషన్‌ పేరిట సింగరాయకొండ సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయంలో డాక్యుమెంటేషన్‌ చేయించారు. గుడ్లూరు మండలం మొగళ్లూరుకు చెందిన సీహెచ్‌ హజరత్‌ తన స్థిరాస్తి రిజి్రస్టేషన్‌కు స్టాంప్‌ డ్యూటీ చెల్లించగా, అది నకిలీ చలానాగా తేలింది. సింగరాయకొండ సబ్‌ రిజి్రస్టార్‌ కార్యాలయంలో దాఖలు చేసి కందుకూరులో రిజిస్టర్‌ అయిన ఈ డాక్యుమెంట్‌ నంబర్‌ 2800/2021. 
మొక్కుబడిగా పరిశీలన... 
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వెలుగు చూసిన నకిలీ ఈ–చలానాల వ్యవహారంపై జిల్లాలో పరిశీలన మొక్కుబడిగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కందుకూరులో బయటపడిన సరికొత్త నకిలీ చలానా వ్యవహారమే అందుకు నిదర్శనంగా ఉంది. జిల్లావ్యాప్తంగా జరిగిన మోసాలు బయటపడకుండా ఉండేందుకు మొక్కుబడిగా తనిఖీలు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒంగోలు రిజి్రస్టార్‌ కార్యాలయంలో వెలుగు చూసిన నకిలీ చలానాల వ్యవహారం కూడా అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. వాస్తవానికి గత నెలలోనే ఈ కుంభకోణాన్ని అధికారులు గుర్తించినప్పటికీ బయటకు పొక్కకుండా తొక్కిపెట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటపెట్టి తాము డబ్బు తిరిగి కట్టించామంటూ కవర్‌ చేశారు. ఈ విషయంలో రిజి్రస్టేషన్‌ శాఖ అధికారుల తీరు చూస్తే దొంగే.. దొంగ అని అరిచినట్టు తెలుస్తోంది. ఒంగోలు సబ్‌ రిజిస్ట్రార్లు అయిన జాయింట్‌–1, జాయింట్‌–2 పరిధిలో నకిలీ చలానాల ద్వారా స్థిరాస్తి రిజి్రస్టేషన్లు జరిగినట్లు తేలింది. మొత్తం 71 స్థిరాస్తి రిజిస్ట్రేషన్లకు సంబంధించిన 77 ఈ–చలానాలు సృష్టించారు. వాటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి స్టాంప్‌ డ్యూటీగా కట్టాల్సిన రూ.26,74,850 మొత్తాన్ని చెల్లించకుండానే నకిలీ చలానాల ద్వారా మోసం చేశారు. సెంట్రలైజ్డ్‌ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (సీఎఫ్‌ఎంఎస్‌) ద్వారా ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో మోసానికి పాల్పడ్డారు. 

ఒంగోలులో హైడ్రామా... 
ఒంగోలు కేంద్రంగా రిజిస్ట్రేషన్‌ శాఖలో నకిలీ చలానాల ద్వారా మోసానికి పాల్పడిన వ్యవహారంలో హైడ్రామా నెలకొంది. నకిలీ ఈ–చలానాలు ముందుగా ఒంగోలులో బయటపడినా రిజి్రస్టేషన్‌ శాఖ అధికారులు కప్పిపెట్టే ప్రయత్నం చేశారు. అది చివరకు రాష్ట్ర ఉన్నతాధికారులకు తెలియడంతో హైడ్రామాకు తెరతీశారు. వాస్తవానికి నకిలీ చలానాలు ఆగస్టు 16వ తేదీనే బయటపడ్డాయి. కానీ, అధికారులు ఆ విషయం బయటకు రాకుండా ప్రయత్నించి ప్రభుత్వాన్ని మోసం చేశారు. సూత్రధారి అయిన ఒంగోలుకు చెందిన డాక్యుమెంట్‌ రైటర్‌ కాజా పవన్‌కుమార్, రిజి్రస్టేషన్‌ అధికారులు కలిసి ప్రభుత్వ ఖజానాకు ఆ మొత్తాన్ని జమ చేయాలని చూశారు. ఆగస్టు 24వ తేదీ వరకు సమాలోచనలు, చర్చోపచర్చలు చేసుకున్నారు. చివరకు ఆగస్టు 24వ తేదీ డాక్యుమెంట్‌ రైటర్‌ కాజా పవన్‌కుమార్‌తో మొత్తం రూ.26,74,850 బ్యాంకు చలానా కట్టించారు.  

పోలీసులకు ఫిర్యాదు చేయడంలోనూ జాప్యం... 
ఒంగోలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరిగిన మోసాన్ని వెంటనే బయటపెట్టకపోవడంతో పాటు పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయలేదు. విషయం బయటకు పొక్కి పత్రికల్లో వార్తా కథనాలు వచ్చిన తర్వాత సెప్టెంబర్‌ 2న అర్ధరాత్రి ఒంగోలు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సెప్టెంబర్‌ 5వ తేదీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంలో కూడా ఎక్కడా దొరక్కుండా చూడాలన్నదే వారి ఉద్దేశంగా తెలుస్తోంది. నకిలీ చలానాలకు పాల్పడిన డాక్యుమెంట్‌ రైటర్‌ పవన్‌తో పాటు ఒంగోలు రిజిస్ట్రేషన్‌ శాఖలో పనిచేస్తున్న పెద్ద తలల పాత్రపై కూడా ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కందుకూరు సంఘటనతో జిల్లావ్యాప్తంగా అప్రమత్తమయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement