ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, పిచ్చాటూరు(చిత్తూరు) : తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ దస్తగిరి కథనం..కొత్త గొల్లకండ్రిగకు చెందిన వెంకటప్ప, అనుసూయ దంపతులకు శ్రీకాంత్(22) ఏకైక సంతానం. డిప్లమో పూర్తి చేసిన అతడు చెన్నైలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సంక్రాంతి సెలవులకు స్వగ్రామానికి వచ్చిన అతడు తనకు బైక్ కొనివ్వాలని తల్లిదండ్రులను పట్టుబట్టాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడ్డాక తీసిస్తామని వారు చెప్పారు. దీనికి మనస్తాపం చెందిన శ్రీకాంత్ మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో తమ పొలాల సమీపంలోని అడవిలోకి వెళ్లి కలుపు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అంతేకాకుండా తన స్నేహితులకు మొబైల్ ద్వారా సమాచారం ఇచ్చాడు. దీంతో అతడి స్నేహితులు వెంటనే అతని తల్లిదండ్రులకు సమాచారం చేరవేయడంతో పాటు సంఘటన స్థలానికి హుటాహుటిన వెళ్లారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న శ్రీ«కాంత్‌ను స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం చెన్నై జీహెచ్ తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం శ్రీ«కాంత్ మరణించాడు. ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రౌడీగా పేరు తెచ్చుకోవాలని..
ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్
అప్పుల బాధతో రైతు..
సాక్షి, గంగవరం(చిత్తూరు: అప్పుల బాధతో రైతు అత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో బుధువారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం..కీలపట్ల కురప్పల్లెకు చెందిన రామ్మూర్తిరెడ్డి(45) వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని పోషించేవాడు. సాగుచేసిన పంటలు చేతికందకపోగా మూడు నెలల క్రితం అప్పు చేసి వేసినా బోరులో నీళ్లు పడలేదు. ఈ నేపథ్యంలో పాడితోనైనా గట్టెక్కుదామని ఇటీవలే వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన మూడు పాడి ఆవులు వరుసగా అనారోగ్యంతో మృతి చెందాయి. వ్యవసాయ నష్టాలు, అప్పులు, పాడి ఆవుల మరణం, కుటుంబ పోషణ..సమస్యలు అతడిని కుంగదీశాయి. దీంతో ఉదయం ఊరి పక్కనున్న పొలం వద్ద పశువుల కొట్టంలో పైపుకి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా ఇది గుర్తించిన మృతుని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పీలేరులో ‘అనంత’వాసి...
పీలేరు రూరల్ : అనంతపురం జిల్లా వాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం పీలేరులో చోటు చేసుకుంది. వివరాలు.. అనంతపురం జిల్లా కొక్కండి క్రాస్‌కు చెందిన కె. మౌలానా (30) మదనపల్లె టౌన్‌లోని బసినికొండలో కె.మౌనిసాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఏ పనీ చేయకుండా మౌలానా బాధ్యతారాహిత్యంగా తిరిగేవాడు. నెల రోజులుగా కలికిరిలోని బంధువుల ఇళ్ల వద్ద ఉంటున్న అతడు బుధవారం పీలేరు ఆర్టీసీ బస్టాండ్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ తిప్పేస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలమేమిటో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
వి.కోటలో గుర్తు తెలియని యువకుడు...
వి.కోట: గుర్తు తెలియని వ్యక్తి ఉరేసుకుని మృతి చెందిన సంఘటన మండలంలో బుధవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం.. దండికుప్పం అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. దాదాపు 20 నుంచి 22 ఏళ్లు ఉన్న మృతుడు ఎరుపు రంగు గళ్ల చొక్కా, సిమెంట్ కలర్ జీన్స్ ఫ్యాంటు ధరించి ఉన్నాడు. మృతదేహం ఉన్న స్థితి బట్టి అతను మూడు రోజుల మునుపే ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. మృతుని వద్ద పోలీసులకు ఎలాంటి వివరాలు లభించలేదు. ఇతని వివరాలు తెలిసిన వారు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ ఎల్లంరాజు కోరారు.
మద్యం తాగొద్దని మందలిస్తే..!
మదనపల్లె టౌన్ : పురుగుల మందు తాగి ఓ మేకల కాపరి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం మదనపల్లెలో చోటుచేసుకుంది. టూటౌన్ పోలీసుల కథనం..స్థానిక గౌతమి నగర్‌లో కాపురం ఉంటున్న నారాయణస్వామి(50)కి భార్య చంద్రమ్మ, నలు గురు పిల్లలు ఉన్నారు. మేకల పోషణపై ఆధారపడి నారాయణస్వామి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని భార్య కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా పట్టించుకోకుండా తరచూ తాగి ఇంటికి వస్తుండడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో అత ను మనస్తాపం చెంది మంగళవారం రాత్రి మద్యంలో పురుగుల మందు కలిపి తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం ఎంతసేపటికీ లేవకపోవడంతో గమనించిన పిల్లలు అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఆటోలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం అతను మృతి చెందాడు. టూటౌన్ ఎస్‌ఐ వంశీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత బలవన్మరణం
కుప్పం రూరల్: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల కథనం.. మండలంలోని పెద్దవంకకు చెందిన లలితాదేవికి, అదే గ్రామానికి చెందిన అశోక్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఇంట్లో తీవ్ర గొడవ లు చోటు చేసుకోవడంతో లలితాదేవి (22) మంగళవారం ఉదయం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. కుప్పం పోలీసులు కేసు నమోదు చేసుకుని బుధవారం శవానికి పోస్టుమార్టం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment