‘చిప్స్‌’తో చీటింగ్‌ | City Commissioner Sajjanar Speaks About Petrol Bunk Chip Fraud | Sakshi
Sakshi News home page

‘చిప్స్‌’తో చీటింగ్‌

Published Sun, Sep 6 2020 3:15 AM | Last Updated on Sun, Sep 6 2020 7:57 AM

City Commissioner Sajjanar Speaks About Petrol Bunk Chip Fraud - Sakshi

చిప్‌కు సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్న సీపీ సజ్జనార్‌

సాక్షి, హైదరాబాద్‌: పెట్రోల్‌ బంక్‌ల్లో ఇంధనం పోసే యంత్రాల్లో ఇంటిగ్రేటెడ్‌ చిప్స్‌ అమర్చి వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతోన్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును సైబరాబాద్‌ పోలీసులు, తూనికలు కొలతల శాఖ అధికారులు రట్టు చేశారు. 1,000 ఎంఎల్‌ ఇంధనానికి 970 ఎంఎల్‌ మాత్రమే పోసేలా చేసి లక్షల్లో డబ్బులు దండుకుంటున్న యజమానులతో పాటు ఈ వ్యవస్థీకృత నేరానికి ఆద్యులైన నలుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి 14 ఇంటిగ్రేటెడ్‌ చిప్స్, 8 డిస్‌ప్లేలు, 3 జీబీఆర్‌ కేబుళ్లు, మదర్‌ బోర్డు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా మోసాల క్రమంలో తెలంగాణలో 11, ఆంధ్రప్రదేశ్‌లో 22 పెట్రోల్‌ బంక్‌లను సీజ్‌ చేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో ఎస్‌వోటీ అడిషనల్‌ డీసీపీ సందీప్‌తో కలిసి పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ శనివారం మీడియాకు కేసు వివరాలు తెలిపారు.  

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఎస్‌కే సుభాని బాషా అలియాస్‌ బాషా పదేళ్లకుపైగా పెట్రోల్‌ బంక్‌ మెకానిక్‌గా పనిచేశాడు. తనకున్న అనుభవంతో.. కస్టమర్‌ అడిగిన దానికన్నా తక్కువగా పోసినా.. డిస్‌ప్లేలో మాత్రం సరిగా కనిపించేలా ఇంటిగ్రేటెడ్‌ చిప్స్‌ అమర్చి సులభంగా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ముంబైకి చెందిన జోసెఫ్, శిబు థామస్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో తయారుచేసిన చిప్స్‌ను రూ.80 వేల నుంచి రూ.లక్షా 20 వేలకు కొన్నాడు. వాటిని ఏలూరుకు చెందిన బాజీ బాబా, శంకర్, మల్లేశ్వరరావుల సాయంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొంతమంది పెట్రోల్‌ బంక్‌ యజమానులను ఒప్పించి వారి బంకుల్లో అమర్చాడు.  

మోసం చేసేదిలా.. 
ఒక్కో పెట్రోల్‌ బంక్‌లో రెండు ఇంధన పంప్‌లు ఉంటే ఒక్కదాంట్లో ఈ చిప్‌ను అమర్చేవారు. పంప్‌ లోపల ఒకటి, బయట కస్టమర్లకు కనిపించే డిస్‌ప్లే బోర్డుకు మరో చిప్‌ అమర్చేవారు. ఇంధనం కొనుగోలుకు వచ్చిన వ్యక్తి లీటర్‌ పోయమంటే 970 ఎంఎల్‌ మాత్రమే పోసేవారు. డిస్‌ప్లేలో మాత్రం లీటర్‌ పోసినట్టే కనిపించేది. ఆయిల్‌ కార్పొరేషన్‌ బృందాలు తనిఖీకి వచ్చినపుడు ఆయా ఇంధన యంత్రాలను చెక్‌చేసి సీల్‌ వేసేవి. ఆపై ఈ ముఠా రంగంలోకి దిగి సీల్‌ కట్‌చేసి చిప్‌ అమర్చి అదే కేబుల్‌ వైర్‌ వాడేది. ఎవరైనా తనిఖీకి వస్తే.. మెయిన్‌ స్విచ్‌ ఆఫ్‌చేసి ఆన్‌చేస్తే మళ్లీ 1,000 ఎంఎల్‌ చూపేలా మదర్‌బోర్డును డిజైన్‌ చేశారు. ఇలా సుభాని గ్యాంగ్‌ ఏడాదిగా తెలుగు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతోంది. దీనిపై ఉప్పందుకున్న నందిగామ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ రామయ్య, బాలానగర్‌ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ రమణారెడ్డి నేతృత్వంలోని బృందం, తూనికలు, కొలతల శాఖ అధికారులతో కలిసి పెట్రోల్‌ బంక్‌లపై దాడి చేసి సుభాని గ్యాంగ్‌ను పట్టుకొని తెలంగాణలో 11 పెట్రోల్‌ బంక్‌లు సీజ్‌ చేశారు. 9మంది పెట్రోల్‌ బంక్‌ యజమానులను అరెస్టు చేశారు. వీరిచ్చిన సమాచారంతో ఏపీలో 22 పెట్రోల్‌ బంక్‌లను సీజ్‌ చేశారు. మోసగాళ్లను పట్టుకోవడంలో చురుగ్గా పనిచేసిన సిబ్బందిని సజ్జనార్‌ రివార్డులతో సన్మానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement