పేలుడుతో ఎగిసిపడుతున్న మంటలు, భవాని (ఫైల్)
బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక గ్రామ పంచాయతీలోని ముత్యాలమ్మపేటలో ఉన్న ఓ ఇంట్లో బుధవారం భారీ పేలుడు సంభవించింది. అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులు పేలడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవదహనమవగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన కూర్మ భీమశంకర్ గత పదిహేనేళ్లుగా సారపాకలో తాపీ పనులు చేస్తూ ముత్యాలమ్మపేటలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు.
ఏటా దీపావళికి ఆయన భారీగా బాణాసంచా విక్రయాలు చేస్తున్నట్లు తెలిసింది. అక్రమంగా బాణసంచా విక్రయాలు జరిపే ఆయన గతేడాది మిగిలిన టపాసులను ఇంట్లోనే నిల్వ ఉంచాడు. బుధవారం సాయంత్రం ప్రమాదవశాత్తు బాణసంచాకు నిప్పంటుకుని మంటలు ఎగసిపడ్డాయి. ఇంట్లో ఉన్న భీమశంకర్ భార్య కూర్మ భవాని (50) మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైంది. ఆమె కుమారుడు దుర్గాప్రసాద్ శరీరం 70 శాతం కాలిపోయింది.
దీంతో ఆయన్ను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. ఈ ఘటనలో మూడు అంతస్తుల భవనం పూర్తిగా కాలిపోయింది. దుర్గాప్రసాద్ సారపాక ఐటీసీ పీఎస్‌పీడీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ప్రమాద సమయంలో భీమశంకర్ భద్రాచలంలో ఉన్నట్లు తెలిసింది. ఆయన సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది. ప్రమాద వార్త తెలియగానే ఎస్‌ఐ జితేందర్, భద్రాచలం అగ్నిమాపక కేంద్రం సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment