బాధితుని ఇంటిముందు పేర్చిన చితి. (ఇన్‌సెట్‌లో) సుదర్శన్
రామాయంపేట, నిజాంపేట (మెదక్): చేతబడి చేస్తున్నాడనే నెపంతో ఒక వృద్ధునిపై అయినవారే హత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన చల్మెడ గ్రామంలో శనివారం వెలుగులోకి వచ్చింది. రామాయంపేట సీఐ చంద్రశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం గ్రామానికి చెందిన గంగుల సుదర్శన్ సోదరి భూదేవికి ముగ్గురు కుమారులున్నారు. కొంతకాలంగా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
సుదర్శన్ తమపై చేతబడి చేస్తున్నాడని కొన్నేళ్లుగా భూదేవి కుటుంబ సభ్యులు అనుమానిస్తూ, అతనిపై కక్ష పెంచుకున్నారు. రెండు రోజుల క్రితం భూదేవి పెద్ద కోడలు అనారోగ్యానికి గురైంది. సుదర్శన్ చేతబడి చేశాడని అనుమానించారు. రెండు కుటుంబాల మధ్య శుక్రవారం రాత్రి గొడవ జరిగింది. శనివారం ఉదయం భూదేవి ఆమె ముగ్గురు కొడుకులు, మరికొందరు సుదర్శన్ ఇంటికి వచ్చి దొరికిన వారిని దొరికినట్లే కొట్టారు.
సుదర్శన్‌ను బయటకు లాక్కొచ్చి అతడి ఇంటి ముందే కర్రలతో చితిపేర్చి పెట్రోల్ పోసి నిప్పటించారు. అదే సమయంలో ఓ కేసు విచారణ నిమిత్తం నిజాంపేట వచ్చిన పోలీసులు మంటలను ఆర్పి సుదర్శన్‌ను రక్షించారు. గాయపడిన సుదర్శన్‌ను 108 అంబులెన్సులో రామా యంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా, వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. అక్కడ మేజిస్ట్రేట్ బాధితుని వాంగ్మూలం తీసుకున్నట్లు సమాచారం. ఘటనలో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్తులు ఒక్కరు కూడా హత్యాయత్నాన్ని అడ్డుకోలేదని బాధితులు వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment