3 నెలలు..7 వేల లావాదేవీలు | Cyber criminals Saikiran and Prashanth were arrested | Sakshi
Sakshi News home page

3 నెలలు..7 వేల లావాదేవీలు

Published Mon, Jul 4 2022 4:11 AM | Last Updated on Mon, Jul 4 2022 4:11 AM

Cyber criminals Saikiran and Prashanth were arrested - Sakshi

రాజంపేట: అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం టి.కందులవారిపల్లెకి చెందిన సైబర్‌ నేరగాళ్లు సాయికిరణ్, ప్రశాంత్‌లను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారిని పశ్చిమ బెంగాల్‌ పోలీసులు కోల్‌కత తీసుకెళ్లారు. టి.కందులవారిపల్లెకి చెందిన సాయికిరణ్‌ ఇటీవల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లోని తన ఖాతాలో ఉన్న రూ.10 వేలు డ్రా చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఖాతా ఫ్రీజ్‌ అయి ఉండటంతో బ్యాంక్‌ అధికారులను కలిశాడు.

వారికి అనుమానం వచ్చి పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేంతవరకు సాయికిరణ్‌తో టైంపాస్‌ చేశారు. కొద్దిసేపటి తర్వాత ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డి సిబ్బందితో వచ్చి సాయికిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సాయికిరణ్‌పై కోల్‌కతలో సైబర్‌ కేసు నమోదై ఉండటంతో పోలీసులు అక్కడి పోలీసు అధికారులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో సోమవారం కోల్‌కత్తా పోలీసులు రాజంపేటకు చేరుకున్నారు.

పట్టణ పోలీసుల అదుపులో ఉన్న సాయికిరణ్‌తోపాటు అతడికి సహకరించిన అదే గ్రామానికి చెందిన ప్రశాంత్‌ను కూడా అరెస్టు చేసి తమ వెంట తీసుకెళ్లారు. సాయికిరణ్‌ మూడునెలల వ్యవధిలో ఏడువేల లావాదేవీలు చేసినట్లు తెలిసింది. ఇందుకు 30 సిమ్‌ కార్డులను వినియోగించినట్లు సమాచారం.

ఈ లావాదేవీల్లో దేశవ్యాప్తంగా పలువురి బ్యాంకు ఖాతాలను హ్యాక్‌చేసి కోట్లాది రూపాయలను వివిధ ఖాతాల్లోకి మళ్లించినట్లు తెలిసింది. కొన్ని ఖాతాల నుంచి డబ్బు డ్రా చేసుకున్నట్లు తెలిసింది. ఈ నేరాలపై కోల్‌కతలో నమోదైన కేసులో అక్కడి పోలీసులు వారిని అరెస్టు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement