West Bengal police
-
పోలీసులు మాకు లంచం ఇవ్వాలనుకున్నారు: వైద్యురాలి తల్లిదండ్రులు
కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటన రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. పలువురిని అరెస్ట్ చేస్తూ విచారణను వేగవంతం చేసింది. మరోవైపు బాధితురాలికి త్వరగా న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ వైద్య విద్యార్ధులు, పలు సంఘాల నిరసనలు పెరిగిపోతున్నాయి.తాజాగా మృతురాలి తల్లిదండ్రులు రాష్ట్ర పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసును అణిచివేసేందుకు పోలీసులు తమకు లంచం ఇవ్వాలని చూశారని ఆరోపించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని, సమగ్ర దర్యాప్తు లేకుండా కేసును మూసివేయడానికి యత్నించారని మండిపడ్డారు.జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసనల్లో పాల్గొన్న బాధితురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ‘పోలీసులు మొదటి నుంచి కేసును మూసివేయడానికి ప్రయత్నించారు. మృతదేహాన్ని చూడటానికి మాకు అనుమతి లేదు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్షల కోసం తీసుకెళ్లేటప్పుడు పోలీస్ స్టేషన్లో వేచి ఉండాల్సి వచ్చింది. హడావుడిగా మా కుమార్తె దహన సంస్కారాలు పూర్తి చేయించారు.మృతదేహాన్ని మాకు అప్పగించినప్పుడు, ఒక సీనియర్ పోలీసు అధికారి మాకు డబ్బును ఆఫర్ చేశారు. కానీ మేము వెంటనే దానికి తిరస్కరించాం. మా కుమార్తెకు న్యాయం చేయాలంటూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈ నిరసనలో పాల్గొంటున్నాం.’అంటూ బాధితురాలి తండ్రి పేర్కొన్నారు.కాగా ఈ కేసును తొలుత కోల్‌కతా పోలుసు దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసు దర్యాప్తులో పోలీసులు విఫలమయ్యారంటూ వైద్యులు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే కేసును కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఘటన చోటుచేసుకున్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను అరెస్ట్ చేసింది. నిందితుడితోపాటు మరికొంతమందికి పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు.మరోవైపు అత్యాచార దోషులకు మరణశిక్ష విధించేలా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఈ వారం అత్యాచార నిరోధక బిల్లును ఆమోదించింది. -
3 నెలలు..7 వేల లావాదేవీలు
రాజంపేట: అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం టి.కందులవారిపల్లెకి చెందిన సైబర్ నేరగాళ్లు సాయికిరణ్, ప్రశాంత్‌లను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారిని పశ్చిమ బెంగాల్ పోలీసులు కోల్‌కత తీసుకెళ్లారు. టి.కందులవారిపల్లెకి చెందిన సాయికిరణ్ ఇటీవల హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లోని తన ఖాతాలో ఉన్న రూ.10 వేలు డ్రా చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఖాతా ఫ్రీజ్ అయి ఉండటంతో బ్యాంక్ అధికారులను కలిశాడు. వారికి అనుమానం వచ్చి పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేంతవరకు సాయికిరణ్‌తో టైంపాస్ చేశారు. కొద్దిసేపటి తర్వాత ఎస్ఐ ప్రసాద్‌రెడ్డి సిబ్బందితో వచ్చి సాయికిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సాయికిరణ్‌పై కోల్‌కతలో సైబర్ కేసు నమోదై ఉండటంతో పోలీసులు అక్కడి పోలీసు అధికారులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో సోమవారం కోల్కత్తా పోలీసులు రాజంపేటకు చేరుకున్నారు. పట్టణ పోలీసుల అదుపులో ఉన్న సాయికిరణ్‌తోపాటు అతడికి సహకరించిన అదే గ్రామానికి చెందిన ప్రశాంత్‌ను కూడా అరెస్టు చేసి తమ వెంట తీసుకెళ్లారు. సాయికిరణ్ మూడునెలల వ్యవధిలో ఏడువేల లావాదేవీలు చేసినట్లు తెలిసింది. ఇందుకు 30 సిమ్ కార్డులను వినియోగించినట్లు సమాచారం. ఈ లావాదేవీల్లో దేశవ్యాప్తంగా పలువురి బ్యాంకు ఖాతాలను హ్యాక్‌చేసి కోట్లాది రూపాయలను వివిధ ఖాతాల్లోకి మళ్లించినట్లు తెలిసింది. కొన్ని ఖాతాల నుంచి డబ్బు డ్రా చేసుకున్నట్లు తెలిసింది. ఈ నేరాలపై కోల్‌కతలో నమోదైన కేసులో అక్కడి పోలీసులు వారిని అరెస్టు చేశారు. -
బెంగాల్ పోలీసులపై సుప్రీం కన్నెర్ర
న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మార్ఫింగ్ ఫొటోను షేర్ చేసిన వ్యవహారంలో బెయిల్ ఇచ్చినప్పటికీ బీజేపీ నేత ప్రియాంక శర్మను జైలు అధికారులు విడుదల చేయకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెను వెంటనే విడుదల చేయకుంటే కోర్టు ధిక్కార నేరం కింద సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని బుధవారం హెచ్చరించింది. సుప్రీం హెచ్చరికల నేపథ్యంలో జైలు అధికారులు ఆమెను విడుదల చేశారు. ప్రియాంక అరెస్ట్ వ్యవహారంలో పోలీసులు నిబంధనలను తుంగలో తొక్కారని ఈ సందర్భంగా జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం ప్రాథమికంగా అభిప్రాయపడింది. తదుపరి విచారణను జూలై నెలకు వాయిదా వేసింది. మమతా బెనర్జీ మార్ఫింగ్ ఫొటోను ఫేస్ బుక్‌లో షేర్చేయడంతో ప్రియాంకను మే 10న అరెస్ట్ చేశారు. దీంతో ప్రియాంక న్యాయ వాది సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. అయితే పశ్చిమబెంగాల్ జైలు అధికారులు ప్రియాంకను విడుదల చేయకపోవడంతో ఆమె సోదరుడు రజీబ్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తీవ్రంగా వేధించారు: ప్రియాంక జైలులో ఉన్నప్పుడు అక్కడి అధికారులు తనను తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేశారని బీజేపీ నేత ప్రియాంక శర్మ ఆరోపించారు. కనీసం తాగటానికి నీళ్లు కూడా ఇవ్వకుండా, ప్రతీరోజూ జైలు గదులు మారుస్తూ హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘క్షమాపణలు అడగటానికి, విచారం వ్యక్తం చేయడానికి నేను ఏ తప్పూ చేయలేదు. జైలర్‌నాతో చాలా దురుసుగా ప్రవర్తించారు. ఓ నేరస్తుడిలా నన్ను జైలు గదిలోకి నెట్టారు. తీవ్రమైన ఎండలు కాస్తుంటే ఒకే గదిలో 40 మంది ఖైదీలను ఉంచారు. నా కుటుంబ సభ్యులు, న్యాయవాదితో మాట్లాడేందుకు కూడా అనుమతించలేదు. నేను విడుదల కావాలంటే ఓ కాగితంపై సంతకం పెట్టాలన్నారు. నాకు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో అలాగే చేశాను’అని వాపోయారు. -
ఇస్కాన్ సభ్యులను కొడుతున్న పోలిసులు మళ్లీ వీడియో వైరల్
-
మరో నకిలీ వీడియో హల్చల్!
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భగవద్గీత పంచుతున్న ఇస్కాన్ సభ్యులను కొడుతున్న పోలీసులంటూ ఓ వీడియో ఆన్లైన్ గత రెండు రోజులుగా వైరల్ అవుతోంది. ఆ వీడియోను ‘వియ్ సపోర్ట్ నరేంద్ర మోదీ’ గ్రూప్ ఫేస్బుక్లో, ట్విట్టర్లో షేర్ చేస్తోంది. ఇదే వీడియో ఇంతకుముందు 2018, ఏప్రిల్ నెలలో వైరల్ అయింది. గోవాలో ఇస్కాన్ సభ్యులపై క్రైస్తవులు దాడి చేసినప్పటి వీడియో అంటూ నాడు ప్రచారం అయింది. వాస్తవానికి ఈ వీడియో 2008, నవంబర్ 26వ తేదీన ‘హెరాల్డ్గోవా డాట్ ఇన్’ వచ్చిన వార్తకు సంబంధించినది. వెబ్‌సైట్‌ను పునరుద్ధరించినందున ఆ సైట్లో వీడియో దొరకలేదుగానీ ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించిన వార్త, దానికి సంబంధించిన ఫొటో వెలుగు చూసింది. ఆన్లైన్లో నకిలీ వార్తలను ఎప్పటికప్పుడు వెతికి పట్టుకునే ‘ఆల్ట్ న్యూస్’ దీన్నీ వెతికి పట్టుకుంది. కాషాయ వస్త్రాలు ధరించిన ఓ రష్యా బృందం పెద్ద పెట్టున డోలక్, హార్మోనియంను వాయిస్తూ హరేరామా, హరేకృష్ణ అని పాడుకుంటూ వెళుతుండగా, చాలా సేపు ట్రాఫిక్ స్తంభించి పోయింది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వచ్చి త్వరత్వరగా రోడ్డు పక్కగా వెళ్లాల్సిందిగా ఆ రష్యా బృందాన్ని ఆదేశించారు. దాంతో ఆ బృందం సభ్యులు పోలీసులతో కొట్లాటకు దిగారు. దానికి సంబంధించిన వీడియోనే. ఆ వీడియోలో కనిపిస్తున్నది నల్లగా ఉండే అచ్చమైన గోవా పోలీసులని స్పష్టంగా తెలుస్తోంది. అలా తెలియకుండా ఉండేందుకు పోలీసుల ముఖాలను కాస్త మార్ఫింగ్ చేశారు. పశ్చిమ బెంగాల్లో మే 12, మే 19న జరగనున్న మరో రెండు విడతల పోలింగ్‌లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఎవరో ఈ వీడియోను పోస్ట్ చేసినట్లున్నారు. నాడు ఈ సంఘటన జరిగినప్పుడు గోవాలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. -
కర్ణన్ కోసం కాళ్లరిగేలా..
సాక్షి ప్రతినిధి, చెన్నై: అయ్యా...ఎక్కడున్నావయ్యా అని ఉసూరుమంటూ జస్టిస్ కర్ణన్ కోసం పశ్చిమ బెంగాల్ పోలీసులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. చెన్నైలో ఉన్నాడనే సమాచారంతో నాలుగురోజులుగా వెతుకులాడుతున్న పోలీసు అధికారులు ఆదివారం సైతం పలుచోట్ల గాలించారు. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా 2015లో సహా న్యాయమూర్తులపై అనేక ఆరోపణలు చేసిన ఫలితంగా కోల్‌కతా హైకోర్టుకు బదీలీ అయ్యారు. అక్కడ సైతం అదే వివాదాస్పద వైఖరిని కొనసాగించి తోటి న్యాయమూర్తులకు విరోధిగా మారారు. న్యాయమూర్తులకు శిక్షలు విధించేందుకు సిద్దం కావడంతో కర్ణన్ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను సైతం కర్ణన్ విమర్శించడంతో ఈనెల 10వ తేదీన ఆరు నెలల జైలు శిక్ష పడింది. కర్ణన్‌ను అరెస్ట్ చేసే బాధ్యతను కోల్కత్తా పోలీసులకు సుప్రీం కోర్టు అప్పగించింది. అయితే పోలీసులు అరెస్ట్ చేసేలోగా కోల్కత్తా నుండి చెన్నై చేరుకున్న కర్ణన్ చేపాక్ ప్రభుత్వ అతిధిగృహంలో బసచేశారు. అదే రోజు రాత్రి పశ్చిమబెంగాల్ పోలీసులు సైతం చెన్నైకి చేరుకుని పోలీస్ కమిషనర్‌ను కలుసుకుని చేపాక్ అతిధిగృహానికి చేరుకున్నారు. అయితే కోర్టు దిక్కరణ కేసులో సుప్రీం కోర్టుచే ఆరునెలల జైలు శిక్ష పడిన కోల్కత్తా హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ ఈనెల 10 తేదీన చెన్నై చేరుకుని పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉన్నారని కొందరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్నారని మరికొందరు చెప్పడంతో పశ్చిమ బెంగాల్ పోలీసులు రెండు ప్రాంతాలకు పరుగులు పెట్టారు. మరికొందరు చేపాక్ అతిధిగృహం వద్దనే కాపుకాసారు. కర్ణన్‌ను అరెస్ట్ చేసేందుకు పశ్చిమ బెంగాల్ పోలీసులతోపాటూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు సైతం రంగంలోకి దిగారు. మూడు రాష్టాల పోలీసులకు చిక్కకుండా జారుకున్నారు. కర్ణన్ కోసం ఒకవైపు గాలింపు జరుగుతుండగా తనకు విధించిన ఆరునెలల జైలు శిక్షను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఈనెల 11వ తేదీన కర్ణన్ అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు. కర్ణన్ ఎక్కడికీ పారిపోలేదు, చెన్నైలోనే ఉన్నారని అప్పీలు పిటిషన్ దాఖలు చేసిన ఆయన తరపు న్యాయవాదులు ప్రకటించారు. కాగా, కర్ణన్‌ను అరెస్ట్ చేసి వెంటనే వెళ్లిపోవచ్చని ఆశించిన పశ్చిమ బెంగాల్ పోలీసులకు నిరాశేమిగిలింది. కర్ణన్ అరెస్ట్‌లో జాప్యం తప్పదని అర్దం చేసుకున్న కోల్కత్తా పోలీసులు చెన్నై ఎగ్మూరులోని ఆఫీసర్స్ మెస్‌లో బస చేసుకున్నారు. -
'నేతాజీ ఫైళ్లు బహిర్గతం'
న్యూఢిల్లీ: ఏళ్ల తరబడి రహస్యంగా, వివాదాస్పదంగా ఉన్న ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదానికి సంబంధించిన ఫైళ్లను చెప్పిన మాట ప్రకారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విడుదల చేసింది. కోల్ కతా పోలీసులు మొత్తం 64 పైళ్లను బహిర్గతం చేశారు. కోల్ కతాలోని పోలీసు మ్యూజియంలో సోమవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం వాటిని పోలీసు ఉన్నత కార్యాలయంలో ఉంచారు.దీంతో ఆయన మరణానికి సంబంధించిన పలు అనుమానాలు వీడనున్నాయి. ఈ ఫైళ్లతోపాటు కొన్ని డీవీడీలు కూడా బయటపెట్టిన హోంశాఖ డీవీడీలను నేతాజీ కుటుంబ సభ్యులకు అందజేసింది. ఈ ఫైళ్లలో మొత్తం 12,744 పేజీలు ఉన్నాయి. '12,744 పేజీలతో మొత్తం 64 ఫైల్స్ ఉన్నాయి. వాటిని బహిర్గతం చేశాం. అన్ని ఫైల్స్ డిజిటలైజ్ చేశాం' అని కోల్ కతా పోలీసు కమిషనర్ సురజిత్ కర్ పర్కాయస్థ అన్నారు. కీళక ఫైళ్లను విడుదల చేస్తున్న సందర్భంగా పలువురు ఆయన కుటుంబ సభ్యులు పోలీసు హెడ్ క్వార్టర్స్‌కు వచ్చారు. వీరిలో నేతాజీ మేనళ్లుడు కృష్ణ బోస్ భార్య కూడా ఉన్నారు. అయితే, ఈ ఫైళ్లు విడుదలకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు ప్రభుత్వ ప్రతినిధులు ఎవ్వరూ కూడా ఈ కార్యక్రమంలో లేకపోవడం గమనార్హం. 1937 నుంచి 1947 మధ్య జరిగిన అంశాలు ఈ పైళ్లలో ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ ఫైళ్లు పెద్దగా ప్రాముఖ్యం లేనివని, వీటి ద్వారా అంత కీలకమైన సమాచారం పెద్దగా తెలియకపోవచ్చని పలువురు అంటున్నారు. కీలకమైన దస్త్రాలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదీనంలోనే ఉన్నట్లు తెలిసింది. విదేశాలతో జాతీయ అంతర్జాతీయ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున నేతాజీ అదృశ్యానికి సంబంధించిన దస్త్రాలను విడుదల చేయలేమని గత ఆగస్టులో ప్రధాని కార్యాలయం కేంద్ర సమాచార కమిషన్‌కు చెప్పడం కూడా అసలైన ఫైల్స్ కేంద్రం వద్దే ఉన్నాయనే అంశాన్ని స్పష్టం చేస్తుంది. వచ్చే ఏడాది బెంగాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే మమత ఇప్పుడు ఆ ఫైల్స్‌తో హడావిడికి తెరతీశారని పలువురు భావిస్తున్నారు. -
పొరపాటుగా కేఎల్ఓ నేత విడుదల..
తర్వాత లొంగుబాటు... పోలీసుల నిర్వాకంపై దర్యాప్తు మాల్దా(పశ్చిమ బెంగాల్): రెండు నెలల కిందట బెంగళూరులో అరెస్టు చేసిన కామ్తాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (కేఎల్ఓ) నేత ఒకరిని పశ్చిమ బెంగాల్ పోలీసులు పొరపాటున విడుదల చేశారు. కేఎల్ఓ నేత తర్వాత తిరిగి లొంగిపోయినా, పోలీసుల నిర్వాకంపై మాల్దా రేంజ్ డీఐజీ సత్యజిత్ బెనర్జీ దర్యాప్తుకు ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జనరల్ రికార్డ్ ఆఫీసర్ జితేన్ రాయ్ సర్కార్, కానిస్టేబుల్ ప్రశాంత ఘోష్‌లను సస్పెండ్ చేశారు. బెంగాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. అజ్ఞాతంలో ఉన్న కేఎల్ఓ అగ్రనేత మల్ఖాన్ సింగ్ సహచరుడైన నబను బర్మన్ను గత మార్చి నెలలో పశ్చిమ బెంగాల్ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. హబీబ్పూర్ కాల్పుల కేసులో నిందితుడైన అతడిని అక్కడి నుంచి తీసుకు వచ్చాక మాల్దా జైలులో ఉంచారు. అదే జైలులో ఉంటున్న కేఎల్ఓ కొరియర్లు కుముద్ బర్మన్, కార్తీక్ మండల్‌లను బుధవారం కోర్టులో హాజరుపరచగా, కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. వారిద్దరూ కూడా హబీబ్పూర్ కాల్పుల కేసులో నిందితులు. వారిద్దరినీ విడుదల చేయాలంటూ కోర్టు నుంచి జైలుకు ఆదేశాలు అందగా, జైలు సిబ్బంది కుముద్ బర్మన్ బదులు నబను బర్మన్ను విడుదల చేశారు. జైలు నుంచి బయటకు వచ్చాక కుముద్ బర్మన్ కామ్తాపూర్ పీపుల్స్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుభాష్ బర్మన్తో ఫోన్లో మాట్లాడాడు. ఈ విషయాన్ని సుభాష్ బర్మన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీర్థా బసు దృష్టికి తేవడంతో జరిగిన గందరగోళం వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి దాటాక సుమారు ఒంటిగంట సమయంలో నబను బర్మన్ పోలీసులకు లొంగిపోయాడు.