కోల్‌కతాలోని ఆర్‌జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటన రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. పలువురిని అరెస్ట్ చేస్తూ విచారణను వేగవంతం చేసింది. మరోవైపు బాధితురాలికి త్వరగా న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ వైద్య విద్యార్ధులు, పలు సంఘాల నిరసనలు పెరిగిపోతున్నాయి.
తాజాగా మృతురాలి తల్లిదండ్రులు రాష్ట్ర పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసును అణిచివేసేందుకు పోలీసులు తమకు లంచం ఇవ్వాలని చూశారని ఆరోపించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని, సమగ్ర దర్యాప్తు లేకుండా కేసును మూసివేయడానికి యత్నించారని మండిపడ్డారు.
జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసనల్లో పాల్గొన్న బాధితురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ‘పోలీసులు మొదటి నుంచి కేసును మూసివేయడానికి ప్రయత్నించారు. మృతదేహాన్ని చూడటానికి మాకు అనుమతి లేదు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్షల కోసం తీసుకెళ్లేటప్పుడు పోలీస్ స్టేషన్‌లో వేచి ఉండాల్సి వచ్చింది. హడావుడిగా మా కుమార్తె దహన సంస్కారాలు పూర్తి చేయించారు.
మృతదేహాన్ని మాకు అప్పగించినప్పుడు, ఒక సీనియర్ పోలీసు అధికారి మాకు డబ్బును ఆఫర్ చేశారు. కానీ మేము వెంటనే దానికి తిరస్కరించాం. మా కుమార్తెకు న్యాయం చేయాలంటూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈ నిరసనలో పాల్గొంటున్నాం.’అంటూ బాధితురాలి తండ్రి పేర్కొన్నారు.
కాగా ఈ కేసును తొలుత కోల్‌కతా పోలుసు దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసు దర్యాప్తులో పోలీసులు విఫలమయ్యారంటూ వైద్యులు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే కేసును కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఘటన చోటుచేసుకున్న ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను అరెస్ట్ చేసింది. నిందితుడితోపాటు మరికొంతమందికి పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు.
మరోవైపు అత్యాచార దోషులకు మరణశిక్ష విధించేలా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఈ వారం అత్యాచార నిరోధక బిల్లును ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment