కర్ణన్ కోసం కాళ్లరిగేలా..
సాక్షి ప్రతినిధి, చెన్నై: అయ్యా...ఎక్కడున్నావయ్యా అని ఉసూరుమంటూ జస్టిస్ కర్ణన్ కోసం పశ్చిమ బెంగాల్ పోలీసులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. చెన్నైలో ఉన్నాడనే సమాచారంతో నాలుగురోజులుగా వెతుకులాడుతున్న పోలీసు అధికారులు ఆదివారం సైతం పలుచోట్ల గాలించారు. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా 2015లో సహా న్యాయమూర్తులపై అనేక ఆరోపణలు చేసిన ఫలితంగా కోల్‌కతా హైకోర్టుకు బదీలీ అయ్యారు. అక్కడ సైతం అదే వివాదాస్పద వైఖరిని కొనసాగించి తోటి న్యాయమూర్తులకు విరోధిగా మారారు. న్యాయమూర్తులకు శిక్షలు విధించేందుకు సిద్దం కావడంతో కర్ణన్ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను సైతం కర్ణన్ విమర్శించడంతో ఈనెల 10వ తేదీన ఆరు నెలల జైలు శిక్ష పడింది. కర్ణన్‌ను అరెస్ట్ చేసే బాధ్యతను కోల్‌కత్తా పోలీసులకు సుప్రీం కోర్టు అప్పగించింది. అయితే పోలీసులు అరెస్ట్ చేసేలోగా కోల్‌కత్తా నుండి చెన్నై చేరుకున్న కర్ణన్ చేపాక్ ప్రభుత్వ అతిధిగృహంలో బసచేశారు. అదే రోజు రాత్రి పశ్చిమబెంగాల్ పోలీసులు సైతం చెన్నైకి చేరుకుని పోలీస్ కమిషనర్‌ను కలుసుకుని చేపాక్ అతిధిగృహానికి చేరుకున్నారు.
అయితే కోర్టు దిక్కరణ కేసులో సుప్రీం కోర్టుచే ఆరునెలల జైలు శిక్ష పడిన కోల్‌కత్తా హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ ఈనెల 10 తేదీన చెన్నై చేరుకుని పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉన్నారని కొందరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్నారని మరికొందరు చెప్పడంతో పశ్చిమ బెంగాల్ పోలీసులు రెండు ప్రాంతాలకు పరుగులు పెట్టారు. మరికొందరు చేపాక్ అతిధిగృహం వద్దనే కాపుకాసారు. కర్ణన్‌ను అరెస్ట్ చేసేందుకు పశ్చిమ బెంగాల్ పోలీసులతోపాటూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు సైతం రంగంలోకి దిగారు. మూడు రాష్టాల పోలీసులకు చిక్కకుండా జారుకున్నారు.
కర్ణన్ కోసం ఒకవైపు గాలింపు జరుగుతుండగా తనకు విధించిన ఆరునెలల జైలు శిక్షను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఈనెల 11వ తేదీన కర్ణన్ అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు. కర్ణన్ ఎక్కడికీ పారిపోలేదు, చెన్నైలోనే ఉన్నారని అప్పీలు పిటిషన్ దాఖలు చేసిన ఆయన తరపు న్యాయవాదులు ప్రకటించారు. కాగా, కర్ణన్‌ను అరెస్ట్ చేసి వెంటనే వెళ్లిపోవచ్చని ఆశించిన పశ్చిమ బెంగాల్ పోలీసులకు నిరాశేమిగిలింది. కర్ణన్ అరెస్ట్‌లో జాప్యం తప్పదని అర్దం చేసుకున్న కోల్‌కత్తా పోలీసులు చెన్నై ఎగ్మూరులోని ఆఫీసర్స్ మెస్‌లో బస చేసుకున్నారు.